బంగ్లాదేశ్‌లో హిందువులు, ముస్లింలు సమానమేనా!?
బంగ్లాదేశ్‌లో హిందువులతో సహా మైనారిటీలపై హింసాత్మక సంఘటనలు జరుగుతున్న తరుణంలో ఐక్యత కోసం తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ ఆలయాన్ని సందర్శించారు. హిందూ నాయకులను కలుసుకుని, ప్రతి ఒక్కరి హక్కులు పరిరక్షిస్తామన్నారు. మతంతో సంబంధం లేకుండా రాజ్యాంగం హక్కులు కల్పించిందన్నారు. మంగళవారం ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించిన తర్వాత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ ప్రజలను “ఓపికతో మెలగాలన్నారు”. తన ప్రభుత్వం చేస్తున్న పనిపై తీర్పు ఇవ్వాలని కోరారు. విస్తృత విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసిన మూడు రోజుల తర్వాత, గత గురువారం బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ అధిపతిగా నోబెల్ గ్రహీత ప్రమాణం చేశారు. బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్, మహానగర్ సర్బజనిన్ పూజా కమిటీ నాయకులతో సహా హిందూ సమూహాల ప్రతినిధులను యూనస్ కలిశారు. “హక్కులు అందరికీ సమానం. మనమందరం ఒకే హక్కు ఉన్న ప్రజలం. మా మధ్య ఎలాంటి విభేదాలు చేయవద్దు. దయచేసి ఓపిక పట్టండి. మేము ఏమి చేయగలిగాం, ఏం చేయలేమో నిర్ధారించండి.” అని అన్నారు.

“మన ప్రజాస్వామ్య ఆకాంక్షలలో, మనల్ని ముస్లింలుగా, హిందువులుగా లేదా బౌద్ధులుగా చూడకూడదు, మానవులుగా చూడాలి. మన హక్కులు నిర్ధారించబడాలి. అన్ని సమస్యలకు మూలం సంస్థాగత ఏర్పాట్ల క్షీణతలో ఉంది. అందుకే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. సంస్థాగత ఏర్పాట్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని యూనస్ వ్యాఖ్యానించినట్టు బంగ్లాదేశ్ వార్తాపత్రిక ది డైలీ స్టార్ పేర్కొంది. మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా యూనస్ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు, ఆయన ఇంతకు ముందు కూడా దాడులు, హేయమైనవని పేర్కొన్నారు. “వారు ఈ దేశ ప్రజలు కాదా? విద్యార్థులు ఈ దేశాన్ని రక్షించగలిగారు. మీరు కొన్ని కుటుంబాలను రక్షించలేరా? వారు నా సోదరులు. మేము కలిసి పోరాడాం. మేము కలిసి ఉంటాం” అని యూనస్ చెప్పారు.