హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయా?
తాజాగా దేశ ఆర్దిక రాజధాని ముంబైలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో ముంబై నగరం ఒక్కసారిగా అన్నీ రాష్ట్రాలను ఆకర్షించిదనే చెప్పాలి. ఇప్పడు దేశంలోని చాలా రాష్ట్రాలు వీటిని తమ రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వీటి కోసం కసరత్తులు మొదలు పెట్టింది. తెలంగాణ ఆర్టీసీ త్వరలో ఈ బస్సులను హైదరాబాద్ నగర వీధుల్లో తిప్పేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగా దేశంలోనే తొలిసారిగా మహరాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను అందించిన అశోక్ లే ల్యాండ్ అనుబంధ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాకుండా మరో 2 కంపెనీలను కూడా టీఎస్‌ఆర్‌టీసీ సంప్రదించి జరిపిన చర్చలు చివరి దశలో ఉన్నాయంటున్నారు.

అయితే ధర విషయంలో స్పష్టత రాగానే తెలంగాణ ఆర్‌టీసీ వీటికి ఆర్డర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే త్వరలోనే హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గతంలో డబుల్ డెక్కర్ బస్సుల సేవలను నిలిపివేసిన తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ వాటిని తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ రావాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆ బస్సులను కొనడానికి టెండర్లును కూడా పిలిచినప్పటికీ..ఆ సమయంలో సరైన నిధులు లేకపోవడంతో వెనుదిరిగారు. అలాంటిది ప్రస్తుతం ముంబైలో ప్రారంభించిన డబుల్ డెక్కర్ బస్సు ఖరీదు దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. మరి తెలంగాణ ఆర్టీసీకీ ప్రభుత్వం నుంచి సాయం అందకపోతే ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసే పరిస్థితి లేదనే చెప్పాలి. అందులోనూ ఈ బస్సుల కోసం ప్రతి షిప్టులో 2చొప్పున రోజుకు మొత్తం 6గురు పనిచేయాల్సి ఉంటుంది. మరి ఇటువంటి తలకు మించిన భారాన్ని మోయడానికి టీఎస్ఆర్‌టీసీ సిద్దం అవుతుందో లేదో వేచి చూడాలి.

