సీఐడీ మరో పిటిషన్, అమరావతి రింగ్ రోడ్డులో బాబును విచారించాలి..!
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు మొదలయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణహాని ఉందన్నారు ఆయన తరపు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా. ఆయనను జైల్లో ఉంచడం ప్రమాదకరమన్నారు. చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదని ఆయన అన్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ మంత్రుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ఆయన ప్రస్తావించారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదనలు విన్పిస్తామని చెప్పారు. ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఏసీబీ కోర్టులో సీఐడీ ఇవాళ మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నిర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో చంద్రబాబును విచారించాలని సీఐడీ కోరింది. ఐఆర్ఆర్‌పై 2022లో చంద్రబాబుపై కేసు నమోదైంది.

మరోవైపు ఇప్పటికే చంద్రబాబు కోసం రాజమండ్రిలో జైలు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జైలులో డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి డీజీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక ఆదేశాలు సైతం వెళ్లాయి. చంద్రబాబు వయసు, ఆరోగ్యం దృష్టి ఆయనను ప్రత్యేకంగా ట్రీట్ చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. కలెక్టర్, వైద్య శాఖ అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రిలోనూ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జడ్ ప్లస్ సెక్యురిటీ ఉండటం, వీఐపీ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజువారీ ములాఖత్‌ల విషయంలో అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. జైలు పరిసర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు తనయుడు, లోకేష్ రాజమహేంద్రవరంలో బస చేశారు. అక్కడ్నుంచే మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. లీగల్ సెల్‌తోపాటుగా, సీనియర్ లాయర్లతో బెయిల్‌కు సంబంధించి చర్చలు జరుపుతున్నారు.

