Andhra PradeshNews

జగన్ సర్కారుతో అమీతుమీకి సై అంటున్న ఉద్యోగ సంఘాలు

◆ మరోసారి సీపీఎస్ అంశంతో యుద్ధానికి రెడీ
◆ సెప్టెంబర్ ఒకటో తేదీన చలో విజయవాడకి శ్రీకారం
◆ సీపీఎస్ హామీపై జగన్ మాట తప్పారంటున్న ఉద్యోగులు
◆ సీఎం ఇంటి ముట్టడంటూ ఉద్యోగ సంఘాల దూకుడు
◆ జగన్ హామీ నిలబెట్టుకోవాలి అంటున్న ఉద్యోగులు

ఏపీలో ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం మరొకమారు ఉద్యమానికి రెడీ అవుతున్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఉద్యోగ సంఘాల పిలుపుతో ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఎలా అయినా ఉద్యోగ సంఘాల చేపట్టిన ఉద్యమాన్ని భగ్నం చేశేలా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఉద్యోగ సంఘాల నేతలపై సర్కారు ఉక్కు పాదం మోపుతోంది. సీఎం ఇంటి ముట్టడికి వెళ్లొద్దంటూ పోలీసులు నాయకులకు ఇప్పటికే నోటీసులు అందజేశారు. ఒకవైపు అనధికారికంగా చర్చలు జరుపుతూనే అణిచివేత ధోరణిని సర్కారు అవలంబిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో ఉపాధ్యాయ సంఘాలు సీపీఎస్ విధానంపై చేపట్టిన ధర్నా సక్సెస్ అవ్వడంతో, ఉపాధ్యాయులకు ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈసారి ఉద్యోగ సంఘాలు చేపట్టిన సీఎం నివాసం ముట్టడి కార్యక్రమం కూడా సక్సెస్ అయితే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమానికి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఎస్ విధానాన్ని కచ్చితంగా రద్దు చేయాలని ఉద్యోగసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల అప్పుడు ఇచ్చిన హామీని జగన్ అంతులేని తాత్సారం చేస్తూ, సీపీఎస్‌ను రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నారు.

జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పటంతో ఉద్యోగ సంఘాలు సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం చేపట్టాయి. పాత పెన్షన్ విధానంలో ఉన్న రూల్స్ ను అమలుచేసి ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పిస్తే దానికి ప్రభుత్వం ఏ పేరు పెట్టిన తాము ఆమోదిస్తామని ఉద్యోగ సంఘాల నేతల కూడా అంటున్నారు. మరి ఉద్యోగ సంఘాల డిమాండ్లకు తలొగ్గి ప్రభుత్వం సత్వర పరిష్కారం ఏదైనా సూచిస్తుందా ? వారి కార్యక్రమం సక్సెస్ కాకుండా అడ్డు తగులుతుందా ? ప్రభుత్వాన్ని ఎదిరించి సభ సక్సెస్ చేసి ఉద్యోగ సంఘాలు తమ బలాన్ని చాటుకుంటాయా అనేది వేచి చూడాలి.