104 రోజులు నాన్ స్టాప్ గా పని చేసిన ఉద్యోగి.. చివరికి!
ప్రపంచంలో ప్రతి మనిషి నిత్యం ఏదొక పని చేస్తూనే ఉంటాడు. ఏదైనా పని చేస్తున్నామంటే..? ఆ పని పూర్తికాకపోయినా.. మన శరీరానికి మాత్రం ఓ చిన్న బ్రేక్ అవసరం. బ్రేక్ లేకపోతే పని ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. అలాంటి ఒత్తిడిని ఓ వ్యక్తి భరించలేకపోయాడు. చివరికి ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషాదకరమైన ఘటన చైనా దేశంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..చైనాలో కార్మిక చట్టాలు అంత కఠినంగా ఉండవు. అందుకే తయారీ రంగానికి చైనా కేంద్రంగా మారింది. అయితే ఇటీవల అక్కడే ఓ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి.. వరుసగా 104 రోజులు సెలవు తీసుకోకుండా నిరంతరం పనిచేశాడు.. రోజుకు 8 గంటలు మాత్రమే కాకుండా ఓవర్ టైం కూడా వర్క్ చేశాడు. అందుకే అతడి ఆరోగ్యం క్షీణించి.. ఆర్గాన్స్ డ్యామేజ్ కారణంగా చనిపోయాడని తోటి ఉద్యోగులు పేర్కొన్నారు. దీనికి కారణం అతనికి ముందస్తు అనారోగ్యం ఉండటం కాదు. అతన్ని ఓ బానిసలా కంపెనీ వాడుకోవడమే ముఖ్య కారణమని తెలుస్తోంది.
వరుసగా 48 గంటలు డ్యూటీ చేసిన ఉద్యోగి తర్వాత ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పడిపోయాడు. వెంటనే తోటి ఉద్యోగులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. శరీరంలోని ఆర్గాన్ ఫెయిలయినట్లుగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే కంపెనీ మాత్రం ఆ ఉద్యోగి పట్ల కనీసం కనికరించలేదు. దీంతో ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లారు. కోర్టులో ఆ కంపెనీ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇచ్చేది లేదని వాదించింది. చైనా లేబర్ చట్టాల ప్రకారమే వ్యవహరించామని.. అతని వారాంతపు సెలవులు ఇచ్చామని కోర్టుకు తెలిపింది. అలాగే ఓవర్ టైం పని చేయాలని చెప్పలేదని.. అలా చేయడం ఉద్యోగుల ఇష్టమని.. ఇష్ట పూర్వకంగానే ఉద్యోగి ఆ పని చేశాడని చనిపోయిన వ్యక్తిపైనే మొత్తం తోసేసింది కంపెనీ. అయితే.. కంపెనీ ఒత్తిడి ఉండటమే కారణమని ఉద్యోగి తరఫున లాయర్ వాదించారు. చివరికి చైనా కోర్టు.. ఆ కంపెనీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిందని తేల్చింది. 56 వేల డాలర్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అంటే చైనా యువాన్ల లో అది నాలుగు లక్షలు. అంత చిన్న మొత్తం ఎందుకిచ్చారంటే.. చైనా లేబర్ చట్టాల్లో అంతే ఉంటుంది కాబట్టి.