Andhra PradeshHome Page Slider

ఏపీకి అమూల్ పెట్టుబడులు- రూ.385 కోట్లతో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ

ప్రసిద్ధ మిల్క్ డెయిరీ అమూల్‌ ఏపీలో  రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని, దీనితో 182 కోట్ల బకాయిలను తీర్చి చిత్తూరు డెయిరీని రీ ఓపెన్‌ చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. హెరిటేజ్‌ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా, ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు పదవిలో ఉన్నప్పుడు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని మండిపడ్డారు జగన్. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు మంగ‌ళ‌వారం నాడు సీఎం జ‌గ‌న్ భూమిపూజ చేశారు. చిత్తూరు డెయిరీలో రోజుకు 3 లక్షల లీటర్లకు ప్రాసెసింగ్‌ చేసే స్థాయికి చేరుకుందని, అటువంటి డెయిరీ పై చంద్రబాబు కళ్లు పడ్డాయని సీఎం అన్నారు. 1992లో ఏర్పడ్డా హెరిటేజ్‌ కోసం ఒక పథకం ప్రకారం చంద్రబాబు ఇదే జిల్లాలోని అతిపెద్ద డెయిరీని కుట్రతో నష్టాల్లోకి నెట్టేస్తూ వెళ్లరని, చెప్పపెట్టకుండా 2002 ఆగస్టు 31న నోటీసులు కూడా ఇవ్వకుండా మూత వేశారని చెప్పారు. రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా వందల కోట్లు బకాయిలు పెట్టారని, లిక్విడేషన్‌ కూడా ప్రకటించారని, ఇదంతా కూడా చంద్రబాబు సొంత డెయిరీ బాగు కోసం జరిగిన కార్యక్రమమని దుయ్యబట్టారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కో–ఆపరేటివ్‌ డెయిరీ అయిన అమూల్‌ను తీసుకువచ్చామని, వారు రూ.350 కోట్ల పెట్టుబడులు ఈ డెయిరీలో పెడుతున్నారని సీఎం పేర్కొన్నారు. ఈ డెయిరీ మీద అమూల్‌ పెట్టుబడులు పెట్టడమే కాకుండా కో–ఆపరేటివ్‌ రంగంలోని లాభాలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి బోనస్‌ ఇస్తూ.. అక్కచెల్లెమ్మలకు లాభాలను పంచిపెడుతోందని తెలిపారు. ఈ డెయిరీ చిత్తూరు జిల్లా రూపురేఖలు మార్చబోతుందని, తొలిదశలో రూ.150 కోట్లతో పనులు మొదలవుతున్నాయని సీఎం అన్నారు. మరో పది నెలల కాలంలోనే పాల ప్రాసెసింగ్‌ లక్ష లీటర్లతో మొదలవుతుందని తెలిపారు. దశలవారీగా ఇక్కడే పాల పొడి తయారీ, యూహెచ్‌టీ పాల విభాగం, చీజ్, పన్నీరు, స్వీట్లు కూడా తయారు చేసే పరిస్థితి వస్తుందని సీఎం పేర్కొన్నారు. ఏకంగా 10 లక్షల లీటర్లు ప్రాసెస్‌ స్థాయికి చేరుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాని హర్షం వ్యక్తం చేశారు. దీనితో ప్రత్యక్షంగా 5వేల మందికి, పరోక్షంగా 2లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు.

చంద్రబాబు తన హయాంలో 54 ప్రభుత్వ, సహకార రంగ సంస్థలను సొంత మనుషులకు పప్పు, బెల్లాల్లా ఆమ్మేశారని మండిపడ్డారు. ప్రభుత్వ, సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు, నూలు ఫ్యాక్టరీలు, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలను ఒక పద్ధతిప్రకారం నష్టాల్లోకి నెట్టి తనకు నచ్చిన వారికి, నచ్చిన రేటుకు అమ్మేసేవారని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా కనిపించదని, కాబట్టే చంద్రగిరి నుంచి కుప్పానికి ఈపెద్ద నాయకుడు వలస వెళ్లాడని సీఎం జగన్ విమర్శించారు. ఇప్పుడు ఆ కుప్పం ప్రజలు కూడా బైబై బాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. కుప్పం ప్రజలను మోసం చేసేందుకు ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటారని, ప్రజలు గమనించాలన్నారు.