Home Page SliderNational

అమిత్ షా అరుణాచల్ పర్యటన… చైనా అభ్యంతరాలు

ఏప్రిల్ 10, 11 తేదీల్లో అరుణాచల్‌లో అమిత్ షా పర్యటన
సరిహద్దు వెంబడి ఉన్న కిబితూ గ్రామంలో టూర్
‘వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్న షా
షా పర్యటన శాంతికి విఘాతమంటున్న డ్రాగన్

హోంమంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను చైనా గట్టిగా వ్యతిరేకిస్తోందని, ఆ ప్రాంతంలో ఆయన కార్యకలాపాలు బీజింగ్ ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేలా చూస్తోందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి సోమవారం ఒక వార్తా సమావేశంలో తెలిపారు. గత వారం, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తన భూభాగంలో భాగమని పేర్కొంటూ పేర్లు మార్చేసింది. హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తున్న “జాంగ్నాన్ చైనా భూభాగం” అని చైనా ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు. కేంద్ర మంత్రి జాంగ్నాన్ పర్యటన చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తోందని, సరిహద్దు పరిస్థితి శాంతి, ప్రశాంతతకు వ్యతిరేకమైనది చైనా అభిప్రాయపడింది. ఐతే హోం మంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు గ్రామం కిబితూ నుండి ‘వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ దేశానికి అత్యంత కీలకమైన రాష్ట్రమని.. స్థానిక ప్రజల అభివృద్ధి కోసం కేంద్రం పనిచేస్తూనే ఉంటుందని చెప్పారు అమిత్ షా. భారతదేశం ఎవరి కోసమో నిర్ణయాలు మార్చుకోదని ఆయన తేల్చి చెప్పారు.

అరుణాచల్ ప్రదేశ్ దేశంలో అంతర్భాగమని ఇండియా మొదట్నుంచి స్పష్టం చేస్తోంది. ఇండియాలోని భూభాగాలకు చైనా పేర్లు మార్చుకోవడం వల్ల గ్రౌండ్ రియాల్టీ ఏమీ మారదని ఇండియా తేల్చి చెబుతోంది. చైనా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఇది మొదటిసారి కాదని… పేర్లు మార్చడం లాంటివి చేస్తూనే ఉందని విమర్శించారు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి. భారత భూభాగంలో ఉన్న ప్రాంతాలకు పేర్లు మార్చడం వల్ల, చైనాకు ఒరిగేదేం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇండియాలోని భూభాగాలపై పేర్లు మార్చి కుట్రలు చేయడాన్ని ఆమోదించబోమని అమెరికా స్పష్టం చేసింది. భారత భూభాగంపై చైనా ప్రయత్నం వ్యర్థమైనదని… చాలా కాలంగా ఆ భూభాగం ఇండియాదని అమెరికా గుర్తించిందని… ఏకపక్షంగా చేసే ప్రయత్నాలను ఆమోదించేది లేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ చెప్పారు.