Andhra PradeshHome Page Slider

ఆరా ఫౌండేషన్ మహా అన్నదానం

ఏటా శివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే ఉత్సావాల్లో పాల్గొనేందుకు, వీక్షించేందుకు వేలాది మంది భక్తులు ప్రఖ్యాత శైవక్షేత్రమైన కోటప్పకొండకు చేరుకుంటారు. మహాదేవుని కరుణాకటాక్షాల కోసం కొందరు వస్తే.. స్వామిని దర్శించే భక్తులకు సేవలందించేందుకు కొందరొస్తారు. ఇక శివరాత్రి పర్వదినం రోజున జరిగే తిరునాళ్ల మహోత్సవంలో ఇసుకేస్తే రాలనంత మంది జనం అక్కడికి చేరుకుంటారు. చేదుకో కోటయ్య అంటూ ఎన్నో వ్యయప్రసాలకోర్చి స్వామి సేవలో తరిస్తారు. ఇలా స్వామిని దర్శించుకునే భక్తకోటితోపాటు, అక్కడ వివిధ సేవల్లో పాల్గొనే అధికార, అనధికార సిబ్బంది కూడా వేల సంఖ్యలో ఉంటారు. వారిందరికీ అన్నదానం నిర్వహించడం చిన్న విషయం ఏమీ కాదు… ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఆరా అన్న ప్రసాదం క్రతువు.. ఇంతింతై.. వటుడింతై అన్నట్టుగా పెరుగుతూ వస్తోంది.

మొదట్లో వందల సంఖ్యలో అన్నప్రసాద వితరణ జరగ్గా ఇప్పుడు వేల మందికి అన్నదాన ప్రసాద వితరణ చేస్తోంది ఆరా ఫౌండేషన్. ఆరా ఫౌండేషన్ నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమం ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు జరగనుంది. అన్నదాన యజ్ఞం నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే 17, 18, 19 తేదీల్లో నిర్విరామంగా కొనసాగునుంది. తాతా గారు జనాబ్ షేక్ మహబూబ్ గారి జ్ఞాపకార్థం ఆరా మస్తాన్ ఉరాఫ్ షేక్ మస్తాన్ ఎనిమిదేళ్లుగా, ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. చిలకలూరిపేటలో మద్దిరాల అన్నదాన శిబిరం, అడ్డరోడ్డు కూడలి అన్నదాన శిబిరంతోపాటుగా ఆలయ సమీపంలోని త్రికోటేశ్వర స్వామి సన్నిదానం సమీపంలోనూ అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం చిలకలూరిపేట నుంచి కోటప్పకొండ వరకు మొబైల్ వాహనాల ద్వారా అన్న ప్రసాద మూడు రోజుల పాటు నిరంతరం కొనసాగుతుంది.

గడిచిన ఎనిమిదేళ్లుగా మహాశివరాత్రి పర్వదినాన ఆ మహా శివుని ఆశీస్సులతో మొట్టమొదటి సంవత్సరం కేవలం రెండు మొబైల్ వాహనాలతో ప్రభల నిర్వహణకు ఆర్టీసీ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి మాత్రమే అన్నదానం నిర్వహించిన ఆరా మస్తాన్… ఏటేట కార్యక్రమాన్ని విస్తృతపరుస్తూ వస్తున్నారు. అన్నప్రసాద వితరణ చేసే మొబైల్ వాహనాల సంఖ్యను పెంచుతూ కోటప్పకొండకు వెళ్లే భక్తులకు, ప్రభల నిర్వాహకులకు, ప్రభుత్వ సిబ్బందికి మూడు రోజులపాటు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపడుతూ వస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం మద్దిరాల గ్రామం స్వస్థలం కావడంతో ఆయన మహాదేవుని సేవను స్ఫూర్తితో కొనసాగిస్తున్నారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కులమతాలకతీతంగా సాటి మనుషులకు సహాయం చేయాలన్న వసుధైక కుటుంబ స్ఫూర్తితో ఈ ఘట్టాన్ని ఆరా మస్తాన్ ఏళ్ల తరబడి నడిపిస్తున్నారు.