InternationalNews

జుట్టు కత్తిరించుకున్న టర్కీ సింగర్‌

హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో ఆందోళనలు వినూత్నంగా జరుగుతున్నాయి. మహిళలు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న జుట్టును కత్తిరించుకొని మంటల్లో వేస్తూ హిజాబ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ప్రభుత్వానికి సవాల్‌ విసురుతున్నారు. వేలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌కు నిప్పు పెడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు. కాల్పులకు సైతం తెగబడుతున్నారు.

జుట్టు ముడి వేసినందుకు కాల్చివేత..

ఈ ఆందోళనల్లో 80 మందికి పైగా మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 ఏళ్ల హదీస్‌ నజాఫీ అనే యువతి కూడా ఇటీవల బహిరంగ ప్రదేశంలో తన జుట్టును ముడిచి నిరసన తెలిపింది. ఆ తర్వాత ఆమె మృతదేహం కనబడింది. నిరసనల్లో పాల్గొన్నందుకు భద్రతా దళాల కాల్పుల్లో ఆమె మరణించినట్లు వార్తలొచ్చాయి. ఆమె ముఖం, ఛాతీ, చేతులు, మెడపై ఆరు బుల్లెట్‌ గాయాలున్నాయని మీడియా వర్గాలు తెలిపాయి.

టర్కీ సింగర్‌ సంఘీభావం..

మరోవైపు.. టర్కీకి చెందిన సింగర్‌ మెలెక్‌ మోసో తాను ప్రదర్శన ఇస్తున్న వేదికపైనే జుట్టు కత్తిరించుకుంది. ఇరాన్‌ మహిళలకు సంఘీభావంగానే ఈ పని చేశానని మెలెక్‌ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇరాన్‌లో హిజాబ్‌ నిబంధన 1979 నుంచే ఉంది. 1995 నాటికి ఈ ఆంక్షలను మరింత కఠినం చేశారు.