గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం..32 మంది సజీవ దహనం
గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొని 32 మంది అగ్నికి ఆహుతయ్యారు. అంతేకాకుండా మరో 85 మంది ఈ ఘటనలో గాయపడినట్లు సమాచారం. ఈ దుర్ఘటన నిన్న రాత్రి చోటుచేసుకుంది. ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళ్తున్న ఓ ప్యాసింజర్ రైలు..తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ ప్యాసింజర్ రైలులోని మొదటి మూడు బోగీలలో తీవ్రంగా మంటలు చెలరేగాయి. మిగిలిన బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడ్డాయి.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న భద్రతాసిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. కాగా వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న మొదటి మూడు బోగీలలో 32 మంది సజీవ దహనమవ్వగా..మిగిలిన వారిని సిబ్బంది కాపాడి హస్పటల్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో బాగా చీకటిగా ఉండడం,మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కాగా ప్రమాద జరిగిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.