మెడికో గొంతుకోసి హతమార్చిన ఉన్మాది
ప్రేమించేందుకు నిరాకరించిందన్న కోపంతో ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని గొంతును ఉన్మాది సర్జికల్ బ్రేడ్‌తో కోసి హతమార్చాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన నిందితుడు జ్ఞానేశ్వర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతడికి తపస్వి అనే ఎంబీబీఎస్ విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఆ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. వీళ్ల మధ్య రాజీ కుదిర్చేందుకు తపస్విని తక్కెళ్లపాడులోని ఓ డెంటల్ కాలేజీలో చదువుతున్న ఆమె స్నేహితురాలు తన వద్దకు పిలిపించుకుంది.

సోమవారం జ్ఞానేశ్వర్‌ను పిలిపించి తపస్వితో రాజీ కుదిర్చేందుకు ఆమె స్నేహితురాలు ప్రయత్నించింది. వాదోపవాదాలు జరగడంతో ఆగ్రహం చెందిన జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడ్‌తో తపస్వి గొంతు కోశాడు. భయపడిన స్నేహితురాలు బయటికెళ్లి కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. వెంటనే డోర్ వేసేసిన జ్ఞానేశ్వర్ కొన ఊపిరితో ఉన్న తపస్వినిని మరో గదిలోకి ఈడ్చుకెళ్లాడు. స్థానికులు తలుపులు పగులగొట్టి తపస్విని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చేయి కోసుకున్న నిందితుడు జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.