Andhra PradeshNews

గోదావరి జిల్లాల్లో బీసీలను కాపుగాస్తామంటున్న వైసీపీ

◆ జనసేన, టీడీపీ కలయికతో మొదలైన టెన్షన్
◆ బీసీల వైపు చూస్తున్న వైసీపీ అధిష్టానం
◆ 175 గెలుపు కోసం కొత్త వ్యూహాల అమలు
◆ వైసీపీలో రెండో లిస్ట్ రెడీ అవుతోందని ప్రచారం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలతో కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతున్నారు. ప్రతి ఎమ్మెల్యే మరింత కష్టపడి పని చేయాలని సూచిస్తూనే, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ప్రతి ఇంట్లో ప్రభుత్వపరంగా అందుతున్న లబ్ధి గురించి వారికి వివరించాలని ప్రతి ఎమ్మెల్యే గడపగడపకూ తిరగాలని కష్టపడి పని చేయకపోతే సరైన ఫలితం రాదని హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో మంచి పేరు లేని ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వమని ఇప్పటికే పలుమార్లు జగన్ స్పష్టం చేయటంతో ఎమ్మెల్యేలందరూ గడపగడపకు తిరుగుతూ గ్రాఫ్‌ను పెంచుకుంటున్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే టికెట్ రాదని టెన్షన్ మొదలైందని టికెట్ల విషయంలో ప్రధానంగా గోదావరి జిల్లాలకు చెందిన కాపు ఎమ్మెల్యేల్లో టెన్షన్ మరింత ఎక్కువైందని ప్రస్తుతం ఏపీలో చర్చ నడుస్తుంది.

2019 ఎన్నికల్లో గెలిచామన్న ఆనందం లేకపోగా… ఆ తరువాత కరోనాతో రెండేళ్ళు ఏమీ చేయలేకపోయామని బాధ, ఇక ఎంతో ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా గెలిచినా కూడా గ్రౌండ్ లెవెల్‌లో కనీసం పింఛన్ కానీ, రేషన్ కార్డు కానీ ఇల్లు కూడ ఇప్పించుకోలేకపోయామే అన్న బాధ ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యే లో ఉంది. వీటికి మించి ఇప్పుడు గడప గడపకూ తిరగమంటూ ఎంత తిరుగుతున్నా గ్రాఫ్ బాలేదని అధినాయకత్వం ఎప్పటికపుడు హెచ్చరిస్తూండటంతో ఈసారి ఎన్నికల్లో టికెట్ రాదేమో అని కొంతమంది తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్నో బాధలతో సతమతమవుతున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో… కొత్త టెన్షన్ మొదలైంది. సర్వేల్లో తాము ముందు వరసలో ఉన్నా ఈసారికి టికెట్ గ్యారంటీ అని అనుకుంటున్న వేళ ఏపీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు బెంబెలెత్తిస్తున్నాయట.

ఏపీలో టీడీపీ ,జనసేన రెండూ కలసి ముందుకు సాగడం ఖాయమని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి.ఈ మేరకు చంద్రబాబు, పవన్ కలసి ఒక ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. పదే పదే ప్రజా సమస్యల మీద కలవాలని కూడా డిసైడ్ అయ్యారు. దాంతో గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఈ కొత్త కలయిక ప్రభావం గట్టిగా ఉంటుందని అంటున్నారు. దాంతో ఇప్పటి దాకా 175 కి 175 సీట్లు మనకే వస్తాయని ధీమాలో ఉన్న వైసీపీ అధినాయకత్వం కొత్త వ్యూహాలకు పదును పెడుతుందని అంటున్నారు. ఆ విధంగా చూస్తే గోదావరి జిల్లాలలో బలమైన కాపు సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకుంటూనే, బీసీల మీద ఆధారపడి కొత్త రాజకీయం చేయాలని వైసీపీ నాయకత్వం అనుకుంటోందని తెలుస్తోంది. ఎటూ కాపు ఓట్లు ఎక్కువ శాతం జనసేన టీడీపీ కూటమికి వెళ్తాయని వైసీపీ హైకమాండ్ అంచనా వేస్తోందట. మరి ఆ ఓట్లను వేరే రూపంలో పొందాలంటే బీసీల మీదనే కోటి ఆశలు పెట్టుకోబోతున్నారని అంటున్నారు.

దాంతో గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినా… అనేక నియోజకవర్గాల్లో భారీ ఎత్తున మార్పుచేర్పులు ఉంటాయని అంటున్నారు. ఒక వేళ కాపు నేతల్లో బలమైన వారు ఉన్నా బీసీలకు తొలి ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. అదే విధంగా గెలుపు గుర్రాలనే ఇప్పటిదాకా లెక్కేసుకున్నారు. కానీ తాజా పరిణామాలతో సామాజిక సమీకరణలను కూడా అంచనా కట్టి ముందుకు సాగుతారని అంటున్నారు. దాంతో మొత్తం వైసీపీ లిస్ట్‌లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే వార్తలు వైసీపీ ఎమ్మెల్యేల గుండెలలో గుబులు పుట్టిస్తున్నాయని అంటున్నారు. ఇక తమకే టికెట్ అని ధీమాగా ఉన్న వారంతా మొదటి లిస్ట్ కాదు… రెండో లిస్ట్ కూడా సిద్ధం అవుతోందన్న సమాచారంతో అలర్ట్ అవుతున్నారు. దాంతో వారిలో ఎక్కడ లేని కంగారూ కూడా కనిపిస్తోందని అంటున్నారు. జనసేన, టీడీపీ కలిస్తే అభ్యర్ధులను మార్పు చేయాలని వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించిందని ప్రచారం జరుగుతుండటంతో ఎమ్మెల్యేలలో సరికొత్త టెన్షన్ పట్టుకుందిట. మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఏమి చేస్తుందో చూడాల్సి ఉంది.