భర్త మృతదేహం వద్దే కుమారుడి వివాహం…
తమిళనాడులోని కృష్ణగిరిలో ఒక విషాదసంఘటన జరిగింది. మరి కొద్ది సేపట్లో కుమారుడి వివాహం జరగబోతుండగా తండ్రి హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. అయితే అంత దుఃఖంలోనూ కుమారుడి వివాహం భర్త మృతదేహం వద్దే జరిపించింది అతని భార్య. కృష్ణగిరికి చెందిన వరదరాజ్ (60) దుస్తుల వ్యాపారం చేసేవారు. అతని భార్య మంజుల. వీరి కుమారుడు మనీశ్‌కి బర్గూరుకు చెందిన కావ్యప్రియతో సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఆదివారం రాత్రి జరిగిన ముందస్తు వేడుకలో పాల్గొన్న వరదరాజ్ హఠాత్తుగా గుండెనొప్పితో మృతి చెందారు. దీనితో కుటుంబసభ్యులు వివాహం వాయిదా వేయాలనుకున్నారు. అయితే పెళ్లికుమారుడి తల్లి మంజుల తన భర్త ఈ వివాహం కుదరగానే ఎంతో సంతోషపడ్డారని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఆత్మశాంతి కోసం వివాహ తంతు పూర్తి చేయాలని కోరారు. దీనితో బందువులంతా చర్చించి వివాహానికి అంగీకారం తెలిపారు. వివాహం అనంతరం వరద రాజ్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.