Andhra PradeshHome Page Slider

చిత్తూరు దంపతులకు అరుదైన అవకాశం

కూలీ పనులు చేసుకుని జీవించే ఆ దంపతులకు అరుదైన అవకాశం లభించింది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ వారికి రాష్ట్రపతి భవన్ ఆహ్వానం పంపింది. చిత్తూరు పట్టణానికి చెందిన సర్దార్, సల్మా అనే దంపతులు ఎన్నో ఏళ్లుగా చిత్తూరు పట్టణంలో నివాసముంటున్నప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు. గత ప్రభుత్వంలో సల్మా పేరుతో నగర శివారులోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఒకటిన్నర సెంటు స్థలం మంజూరైంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పక్కా ఇల్లు కూడా మంజూరవడంతో అష్టకష్టాలు పడి మూడు నెలలకే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి, గృహప్రవేశం కూడా పూర్తి చేశారు. దీన్ని రికార్డు చేసిన గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రభు త్వానికి నివేదించారు. ఆ నివేదిక ఆధారంగా సల్మా దంపతుల పట్టుదల ఆకాంక్షలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ ఆహ్వానం పంపింది. 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు దంపతులిద్దరూ రేపు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో పాటు నగర మేయర్ ఆముద, అధికారులు ఆ దంపతులకు సన్మానించి అభినందనలు తెలిపారు.