ఈ ఏడాది భారత రత్న రేసులో వారే..
ఈ సంవత్సరం భారత రత్న అవార్డు ఎవరిని వరించబోతోందనే ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ రేసులో ఇద్దరి పేర్లు బలంగా వినపడుతున్నాయి. ఇటీవల కన్నుమూసిన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా పేరును, ఢిల్లీ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారు. అయితే ఈ రేసులో తెలుగుజాతి గౌరవం ఎన్‌టీ రామారావు కూడా ఉన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయనకు భారత రత్న ఇవ్వాలని ఇటీవల ఎన్టీఆర్ వర్థంతి వేడుకలలో కూడా కోరారు. ఈ సారి రిపబ్లిక్ డే కంటే ముందే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతేడాది ఐదుగురికి భారత రత్న అవార్డులు వచ్చిన సంగతి తెలిసేందే. బీజేపీ కురు వృద్ధుడు ఎల్‌కే అధ్వానీతో పాటు పీవీ నరసింహారావు, స్వామినాథన్, చరణ్ సింగ్, కర్పూరీ ఠాకూర్‌లకు భారత రత్న అవార్డులు వచ్చాయి.