దేవుడితో రాజకీయలా… లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు..
రాజకీయాలు, మతం మిక్స్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వానికి హితవు పలికింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న ఆరోపణలపై దాఖలైన మూడు పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి కలుషితమైందనడానికి చెప్పడానికి కచ్చితమైన రుజువు లేదని మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు స్పష్టమైన వ్యాఖ్యానించింది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ సైతం సవ్యంగా లేదంది. ఈ వివాదాస్పద అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ ప్రకటనలు చేయడం, ముఖ్యంగా గుజరాత్ ల్యాబ్ జూలై నివేదికలో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పందికొవ్వు ఉన్నాయంటూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించినందున న్యాయస్థానం మొత్తం వ్యవహారంపై అనేక అబర్వేషన్లు చేసింది.

“మీరు (ముఖ్యమంత్రి) రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు.. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచుతారని మేము భావిస్తున్నాం, మీరు ఇప్పటికే విచారణకు ఆదేశించినప్పుడు, మీడియా ముందుకు వెళ్లవలసిన అవసరం ఏమిటి? ల్యాబ్ రిపోర్ట్ జులైలో వచ్చింది. మీ ప్రకటన సెప్టెంబర్‌లో వచ్చింది. ఐనా, నివేదిక అస్సలు స్పష్టంగా లేదు…” అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తిరుపతి లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సెప్టెంబర్ 20న తన ప్రత్యర్థి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అనవసరమైన వ్యాఖ్యల ‘హ్యాట్రిక్’పై ముఖ్యమంత్రిని కోర్టు హెచ్చరించింది. సంయమనం పాటించాలని న్యాయమూర్తులు కోరారు.

చంద్రబాబు వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులను ఆందోళనకు గురి చేసింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మొత్తం వ్యవహారంపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో ఆలయానికి ‘శుద్ధి’ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రకటించడం సంచలనం కలిగించింది. ప్రభుత్వ ఆరోపణలపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. టీడీపీవి ద్వేషపూరిత వాదనలంటూ ఆయన ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ఇలాంటి విపరీతమైన వ్యాఖ్యలతో ఆలయ పవిత్రతను దెబ్బతీసిందని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ లేఖ రాశారు. చంద్రబాబు కట్టుకథలు చెబుతున్నారని, అబద్దాలకోరని ఆరోపించారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. మొత్తం వ్యవహారంపై పూర్తి ఫోరెన్సిక్ నివేదికను సమర్పించాల్సిందిగా ఏపీ సర్కారును ఆదేశించాలని జస్టిస్ సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అదే సమయంలో మరో పిటిషన్‌లో టీడీపీ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.

పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.‘మీరు ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు.. ఫలితం వచ్చే వరకు… మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇలా రెండోసారి వ్యాఖ్యానించారు…” అంటూ కోర్టు ప్రశ్నించింది. నెయ్యి నాణ్యతపై దర్యాప్తు కొనసాగుతోందని, జస్టిస్ గవాయ్ అన్నారు. అలాంటి సమయంలో మీడియాకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మతపరమైన మనోభావాలను గౌరవించాలని చంద్రబాబుకు సూచించారు.

జంతువుల కొవ్వు ఉందని చెబుతున్న నెయ్యినే ఉపయోగించి లడ్డూలను తయారు చేశారని చెప్పడానికి ఆధారమేముంది? జులై 6, 12 తేదీల్లో డెలివరీ చేసిన ట్యాంకర్లను పరీక్షించారని, ఆ నెయ్యిని టీటీడీ అవసరాల కోసం ఉపయోగించలేదని కోర్టు పేర్కొంది. ల్యాబ్‌కు పంపించిన నెయ్యి జులై 4 వరకు వాడిన నెయ్యి, జూన్0లో డెలివరీ కాలేదని తేలింది. గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్‌లోని సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ ల్యాబ్ రూపొందించిన నివేదికను కోర్టు నిరాకరించింది. రిపోర్ట్‌ను గట్టిగా చదవాలని టీడీపీ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను కోరగా.. ‘‘ఈ విషయం ప్రజలకు తెలియకపోవచ్చు…ముఖ్యమంత్రి మాత్రం స్టేట్‌మెంట్ ఇచ్చారు…’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. రెండోసారి మీడియా ముందుకు వెళ్లే ముందు కొంచెమైనా ఆలోచించాల్సిన అవసరం లేదా అంటూ టీడీపీ న్యాయవాది లుధ్రాను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

