సీఎం సార్.. ఒవైసీ బ్రదర్స్ ను వదలొద్దు..
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేతలపై అధికార పార్టీ కాంగ్రెస్ నేతలతోపాటు ప్రతి పక్ష పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. చెరువులను కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవటం అభినందనీయమని కొనియాడారు. ఒవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని రాజాసింగ్ అన్నారు. వేల మంది యువత మద్దతు ఉందని అక్బరుద్దీన్ బెదిరిస్తున్నారన్నారు. గతంలో ఒవైసీ బ్రదర్స్ లను జైలుకి పంపించారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తు చేశారు. ఆయన మాదిరి భయపడకుండా రేవంత్ రెడ్డి ముందుకెళ్లాలని సూచించారు. ఉచిత విద్య పేరుతో ఒవైసీ సోదరులు కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు. చెరువులో 12 ఎకరాలు ఆక్రమించి ఫాతిమా కాలేజ్ నిర్మాణం చేపట్టారన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ప్యాలెస్ కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉందని గుర్తు చేశారు రాజాసింగ్.