విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు లాంఛనమేనా?
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గెలుపు లాంఛనప్రాయమయ్యిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీల నుండి టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తేలిపోయింది. నామినేషన్ల సమయం ముగిసిన సమయానికి కూడా కేవలం రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి. వైసీపీ నుండి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా షేక్ సఫి ఉల్లా నామినేషన్ వేశారు. టీడీపీ తరపున ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో రేస్ నుండి తప్పుకున్నట్లు భావిస్తున్నారు. దీనితో బొత్స గెలుపు లాంఛనమయ్యిందని భావిస్తున్నారు. సరైన బలం లేకపోవడం వల్లే ఎన్నికలలో పోటీ చేయడం లేదని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, స్థానికేతరుడిని నిలబెట్టాలని భావించారని సమాచారం. దానికి నేతలు ఒప్పుకోకపోవడంతో ఈ అభిప్రాయం విరమించుకున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానికేతరుడిని ఎలా నిలబెట్టాలనే మీమాంసలో పడ్డారని తెలుస్తోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరగనుంది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఓటు వినియోగించుకుంటారు. ఆగస్టు 30న పోలింగ్ కాగా, సెప్టెంబరు 3న కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 841 ఓట్లకు గాను, వైసీపీకి 615మంది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.