“కేసీఆర్‌ను తిట్టడానికే అసెంబ్లీని వాడుతున్నారు”- సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలలో ఎంతసేపూ కేసీఆర్‌ను, కేటీఆర్‌ను తిట్టడమే కాంగ్రెస్ నేతలకు పనిగా మారిపోయిందని, అందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆమె విమర్శించారు. శాసనసభలో తనను చూస్తేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. మహిళల పట్ల సీఎం ప్రవర్తించిన తీరు బాగోలేదని, సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ 4 గంటల పాటు నిలబడి ఉన్నా కూడా మైక్ ఇవ్వలేదని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రులెందరినో చూశానని వారందరూ మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేవారని పేర్కొన్నారు. సభలో 9 మంది మహిళలు ఉన్నా కూడా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. పార్టీ మారడం నేరమైతే, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారని ఆమె ప్రశ్నించారు. సభలో లేని కవిత ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారు?. రాష్ట్రంలో, హైదరాబాద్‌లో, శాసనసభలో మహిళలకు అవమానం జరుగుతోంది. భద్రత కరువయ్యిందన్నారు.