“అమ్మో..బ్రెయిన్ ఈటింగ్ అమీబా..చంపేస్తుంది”
‘నేగ్లేరియా ఫౌలెరి’ అనే ఒక రకమైన ఏకకణ జీవి ఈ అమీబా. ఇది శరీరంలో చేరిందంటే ప్రాణం పోయినట్లే. ఈ మధ్యకాలంలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా పేరు బాగా వినపడుతోంది. కొన్ని నెలలుగా కేరళలో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికే ముగ్గురు మరణించారు. ఇది శరీరంలో ప్రవేశించిన వారిలో 97 శాతం మంది మరణిస్తున్నట్లు అంచనా. ఇది మెదడు కణజాలాన్ని నాశనం చేసేస్తుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ సంగతి తెలిపింది. ఈ అమీబా ఎక్కువగా నదులు, సరస్సులు, స్విమ్మింగ్ పూల్స్‌లో ఉంటుంది. సరిగ్గా క్లోరినేషన్ చేయని వాటర్ పార్కుల్లో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాలలో ఈత కొట్టేందుకు దిగితే, ముక్కు ద్వారా ఈ అమీబా మానవ శరీరంలో చేరుతుంది. ముక్కు నుండి మెదడుకు చేరి మెదడు కణజాలాన్ని నాశనం చేస్తుంది.

లక్షణాలు:
ఈ అమీబా శరీరంలో ప్రవేశించిందో లేదో మామూలు వైద్య పరీక్షల ద్వారా గుర్తించడం కష్టం. దీని లక్షణాలను బట్టే గుర్తించవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన 5 రోజుల తర్వాత మనిషి కోమాలోకి వెళ్లడం, మరణం సంభవించవచ్చు. మొదట్లో తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అమీబా శరీరంలో ప్రవేశించిన తర్వాత మెడ కండరాలు బిగుసుకుపోవడం, బ్యాలెన్స్ తప్పి పడిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
నివారణ:
దీనికి చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. కలుషితంగా ఉన్న చెరువులు, నదుల్లో స్నానం చేయకూడదు. శుభ్రంగా లేని స్విమ్మింగ్ ఫూల్స్‌లో ఈత కొట్టరాదు. వాటర్ పార్కులు, స్విమ్మింగ్ ఫూల్స్‌లో ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయించాలి. ఇది ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది కాబట్టి ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి.