పసిపిల్లల ఆహారం గురించి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సూచనలు
పసిపిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం ఆరు నెలల వయస్సు వచ్చాక శిశువులకు ఇవ్వవలసిన ఆహారాన్ని సూచించింది. శిశువులకు ఆరునెలల అనంతరం తల్లి పాలు మాత్రమే సరిపోదని, వారికి మెరుగైన పోషకాహారం అందివ్వాలని పేర్కొంది. దీనికోసం పప్పుధాన్యాలు కూడా అందించాలని, వాటిలో ఉడికించిన కూరలు కూడా కలిపి ఇవ్వవచ్చని పేర్కొంది. ఒక సంవత్సరం లోపు శిశువుల ఆహారంలో ఉప్పు, చక్కెరలు కలపకూడదని చెప్పింది. మసాలాలు ఉండే ఆహారాలు మూడేళ్ల వరకూ పెట్టకూడదని, ఆహారంలో నెయ్యి కలిపి పెట్టడం మంచిదేనని వెల్లడించింది.
అన్ని రకాల పళ్లు, కూరగాయలను పిల్లలకు 10 నెలల అనంతరం అలవాటు చేయవచ్చని వెల్లడించింది. వీటిలో చక్కెర కలుపవద్దని, ఆయా పండ్లలో ఉండే సహజమైన తీయదనం వారికి సరిపోతుందని పేర్కొంది. క్యారెట్, సొరకాయ, గుడ్లు, చేపలు వంటి ఆహారాన్ని వయస్సును బట్టి ఒక్కొక్క నెలలో అలవాటు చేయాలని, పూర్తి సంపూర్ణాహారాన్ని అందించేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని సూచించింది. ఆరునెలలు దాటిన పిల్లలకు మొదటి వారంలో కూరగాయలు, రెండవ వారంలో అన్నం ఇవ్వవచ్చని పేర్కొంది. ఏడాది దాటిన తర్వాతనే పిల్లలకు తల్లి పాలు కాకుండా బయటి పాలు ఇవ్వవచ్చని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది.