“నిధుల సమీకరణకు ప్రభుత్వం ప్రమాదకరమైన మార్గాన్ని అనుసరిస్తోంది”.. కేటీఆర్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపలేకపోతోందని ఎద్దేవా చేశారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్. ఇప్పుడు నిధుల సమీకరణ కోసం ఒక ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి రూ. 10 వేల కోట్లు సంపాదించాలని చూస్తోందన్నారు. మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్‌ను కూడా పెట్టిందని, వారికి రూ.100 కోట్ల కమీషన్ ఇవ్వాలని సిద్ధపడిందన్నారు. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, కొత్త పరిశ్రమలకు ఆస్కారం లేకుండా పోతుందన్నారు. ఏడు నెలలుగా పారిశ్రామిక రంగం స్తబ్ధుగా ఉందని, కొత్త పరిశ్రమలు రావడం లేదని, సరైన ప్రోత్సాహం లేదని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం పరిశ్రమలకు ఇవ్వాల్సిన భూములు తాకట్టు పెట్టేస్తే, కొత్త పరిశ్రమలు, కంపెనీలకు ఏమిస్తారు? యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని తన ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారు.