వందల ఏళ్ల నాటి సీసాల్లో తాజాగా చెర్రీ పళ్లు
దాదాపు 250 ఏళ్ల క్రిందటి సీసాలలో తాజాగా చెర్రీ పళ్లు దర్శనమిచ్చాయి. ఈ వింత అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ కాలం నాటి ప్యాలెస్‌లో కనిపించింది. అమెరికా మొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్‌కు చెందిన మాన్షన్ హౌస్‌లో డజన్ల కొద్దీ సీసాలు తవ్వకాలలో బయటపడ్డాయి. ఆయనకు చెర్రీలు, బెర్రీలు అంటే చాలా ఇష్టమట. అప్పట్లో వాటిని నిల్వ ఉంచిన సీసాలలో ఇప్పటికీ ఆ పళ్లు తాజాగా ఉండడం విశేషం. ఆయన 250 ఏళ్ల క్రితం నివాసం ఉన్న వర్జీనియాలోని మౌంట్ వెర్నాన్ హోమ్‌లో వీటిని తవ్వితీసిన పురాతత్వ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.

జార్జ్ వాషింగ్టన్ జయంతిని ఘనంగా జరపాలని అమెరికా ప్రభుత్వం ఆయన నివశించిన బంగళాను మరమ్మత్తులు చేయడం ప్రారంభించింది. దీనిలో కనిపించిన స్టోరేజ్ పిట్స్‌ను తెరిచి చూడగా వాటిలో ఈ పళ్లు నిల్వ ఉంచిన సీసాలు బయటపడ్డాయి. ఈ సీసాలలో పులియబెట్టిన పళ్లు ఉన్నాయి. ఈ చెర్రీ విత్తనాలను నాటితే మొలకెత్తుతాయా అనే పరిశోధనలు కూడా మొదలుపెట్టారు. జార్జ్ వాషింగ్టన్ కాలంలో వీటితో వైన్ చేయడం అలవాటు అని తేలింది. అలాగే వీటిని ఐస్‌క్రీములలో కూడా కలిపి తినేవారట.