పగిలిన గాజు గ్లాస్… సైకిల్‌కు పంక్చర్ తప్పదా!?
ఇటీవల పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తూ… గాజు గ్లాస్ పగలే కొద్ది పదునుక్కుద్దని వ్యాఖ్యానించారు. అలా పగిలిన గ్లాస్, పదునెక్కి సైకిల్ పంక్చర్ పెట్టబోతుందా.. అంటే ఏమో చెప్పలేమన్నట్టుగా తాజా పరిణామాలు కన్పిస్తున్నాయ్. ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ అనూహ్యంగానే ఉంటాయ్. మిగతా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని అంచనా వేసినట్టుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేయడం కష్టమన్న భావన సర్వత్రా ఉంది. ఏపీలో మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓవైపు వైసీపీ మరోవైపు కూటమి హోరాహోరీగా తలపడుతున్న తరుణంలో విజయం కోసం రెండు పక్షాలు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయ్. తాజాగా ఏపీలో ఎన్నికల క్రతువు మరో ఘట్టానికి చేరుకొంది. నామినేషన్ల ఉపసంహరణ, ఆమోదం తర్వాత ఇప్పుడు ఎన్నికలు చివరి అంకానికి తెరదీశాయి. ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని వైసీపీ భావిస్తుంటే, మరోవైపు కూటమి ద్వారానైనా ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ, జనసేన, బీజేపీ భావిస్తున్నాయ్. ఈ తరుణంలో అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో కూటమికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా కేవలం 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో బరిలో దిగనుండగా టీడీపీ, బీజేపీ మిగిలిన చోట్ల పోటీలో నిలిచింది.

ఈ తరుణంలో జనసేన, టీడీపీ రెబల్స్ కొందరు పోటీకి దిగగా, మరికొందరు నేతలు గాజు గ్లాస్ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎత్తులు వేశారు. దీంతో జనసేన పార్టీ సింబలైన గాజు గ్లాస్, ఆ పార్టీ పోటీ చేయని పలు నియోజకవర్గాల్లో స్వతంత్రులకు అధికారులు కేటాయించారు. జనసేన పార్టీ సింబలైన గాజు గ్లాసు స్వతంత్రులకు కేటాయించడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ-బీజేపీ అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారుతోంది. గాజు గ్లాసుతో సైకిల్‌కు పంక్చర్ తప్పదా అన్న భావన కలుగుతోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు సుమారుగా 50 నియోజకవర్గాల్లో ఇప్పుడు పలువురు అభ్యర్థులు గాజు గ్లాస్ సింబల్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల విశ్లేషకులు, పండితులు ఈ ఎన్నికల్లో హోరాహారీ తప్పదని భావిస్తున్న సమయంలో గాజు గ్లాస్ సింబల్ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, బీజేపీకి ఇబ్బందికరంగా మారుతోందన్న వర్షన్ విన్పిస్తోంది. జనసేన అధినేత, ఏపీలో వైసీపీని ఓడించేందుకు తనుకు వ్యూహం ఉందని చెప్పినప్పుడు జనసైనికులు ఎంతో సంబరపడ్డారు. తొలుత జనసేన 60 సీట్లలోనైనా పోటీ చేస్తారని వారు ఆశపడ్డారు. ఆ తర్వాత ఆ నెంబర్ 40 సీట్లైనా దక్కుతాయనుకున్నారు. 24 సీట్లు ఖరారయ్యాని నిట్టూర్చారు. చివరకు అది 21 వద్ద ఆగింది.

మొదట్నుంచి పార్టీ కోసం పనిచేసిన చాలా మంది నాయకులు జనసేన రెబల్స్‌గా కొన్ని చోట్ల బరిలో దిగగా.. జనసేన సానుభూతిపరులు కొందరు గాజు గుర్తు కోసం ప్రయత్నించగా, కొందరు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవచ్చని గాజు గ్లాస్ దక్కేలా చూసుకున్నారు. మొత్తంగా ఎన్నికల్లో సత్తా చాటేందుకు గాజు గ్లాస్ ఉపకరిస్తుందని కొందరు భావించారు. దీంతో తమకు గ్లాస్ సింబల్ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారులను కోరారు. దీంతో జనసేన అభ్యర్థులు లేని చోట్ల ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రిటర్నింగ్ ఆఫీసర్స్ గాజు గ్లాస్‌ను ఎలాట్ చేశారు. మొత్తంగా తాజా ఎన్నికలో సుమారుగా 50 మందికి పైగా జనసేనకు వర్తించే గాజు గ్లాస్ సింబల్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన పాఠంశెట్టి సూర్యచంద్రకు గ్లాస్ గుర్తు కేటాయించారు. మొన్నటి వరకు ఆయన జనసేనలో యాక్టివ్ గా ఉన్నారు. పొత్తులో ఆయనకు అవకాశం లభించలేదు. ఆయనకు గాజు గ్లాస్ రావడంతో ఎలా ఉంటుందోనన్న ఆందోళన టీడీపీలో ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీ-వైసీపీ మధ్య హోరాహోరీ ఉందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు కేటాయించగా.. ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న స్పీకర్ తమ్మినేని సీతారామ్ నియోజకవర్గమైన ఆముదాలవలసలోనూ స్వతంత్ర అభ్యర్థి గాజు గ్లాస్‌పై పోటీ చేయనున్నారు. అక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇక విజయనగరం నియోజకవర్గంలోనూ పోటీ అలాగే ఉందంటున్నారు. అక్కడ టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాస్ కేటాయించడంతో టీడీపీ మండిపడుతోంది. విశాఖ తూర్పు, భీమిలీ రెండు సీట్లలోనూ కాపు సామాజికవర్గం ఓట్లు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇక ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఈసారి ఎవరో ఒకరు స్వీప్ చేస్తారా లేదంటే హోరాహోరీ ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోటీ చేయడంతోపాటుగా రెండు జిల్లాల్లో జనసేన 11 స్థానాల్లో పోటీ చేస్తోండగా.. ఇక్కడ కాపు ఓట్లు కీలకంగా ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ గణనీయంగా ఓట్లు చీలితే అది గెలుపు ఓటములపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కూటమిలో భాగంగా టీడీపీని గెలిపించాలని పవన్ కల్యాణ్ చెబుతున్నా, కాపు వర్గీయులు ఓట్లు ఎలా వేస్తారన్నదానిపై మీమాంశ ఉంది. ఉభయగోదావరి జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలుస్తామనుకుంటున్న పలు సీట్లపై గాజు గ్లాస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, అమలాపురం, ముమ్మడివరం, రాజమండ్రి సిటీ, కొత్తపేట, జగ్గంపేట, మండపేట నియోజకవర్గాల్లో పలు చోట్ల నువ్వా-నేనా అన్నట్టుగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి కాపు అభ్యర్థి ఉంటే, అక్కడ ఓటరు ఎలా ఓటేస్తారన్నది ఆసక్తికరంగా ఉంది. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు, పాలకొల్లు, తణుకు.. మూడు చోట్ల కూడా ఈసారి జెండా ఎగురేయాలని టీడీపీ భావిస్తుంటే, ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించడం ఎలాంటి ట్విస్టులు ఇస్తోందోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇక పొలిటికల్ క్యాపిటల్ విజయవాడలోనూ పరిస్థితి.. హైఓల్టేజ్ లా మారుతోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట్ల పలువురికి గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు. మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు , గన్నవరం, మచిలీపట్నం నియోజకవర్గాల్లోనూ ఫలితాలు ఎలా ఐనా మారొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ స్వతంత్ర అభ్యర్థి గాజు గ్లాసుపై పోటీలో నిలిచారు. ఇక హోరాహోరీ పోరు తప్పదని ప్రచారం జరుగుతున్న బాపట్ల, పెదకూరపాడు, మాచెర్లలోనూ స్వతంత్రులకు గాజు గ్లాస్ కేటాయించడం, టీడీపీ నేతలను చికాకుపెడుతోంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల సెగ్మెంట్లోనూ అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయించారు. నెల్లూరు జిల్లా కావలిలోనూ ఇండిపెండెంట్ అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తుపై పోటీలో ఉన్నారు.

ఇక రాయలసీమ జిల్లాల్లోనూ కొందరికి గాజు గుర్తు కేటాయించడం టీడీపీ నేతల్లో ఆందోళనకు కారమవుతోంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సీటుపై జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గాజు గ్లాస్ పై కంటెస్ట్ చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ, హైఓల్టేజ్ సమరానికి కేంద్రమైన మదనపల్లె, చంద్రగిరిలోనూ గాజు గ్లాస్ తో స్వతంత్రులు పోటీలో ఉన్నారు. ఇక అనంతపురం జిల్లా రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో మరోసారి స్వీప్ చేయాలని భావిస్తున్న వైసీపీకి ఇక్కడ టీడీపీ గట్టి పోటీ ఇస్తోంది. రెండు జిల్లాల్లోని ఆదోని, పత్తికొండ, కమలాపురం, మైదుకూరు, రాజంపేట నియోజకవర్గంలో స్వతంత్రులకు జనసేన సింబల్ గాజు గ్లాస్ కేటాయించారు.

ఇక ఎంపీ స్థానాల్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు చిరాకుపడుతున్నారు. సీఎం రమేష్ పోటీ చేస్తున్న అనకాపల్లి, బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రిలోనూ అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న మడ్లమూరి కృష్ణస్వరూప్ కు గాజు గ్లాస్ కేటాయించారు. ఈ పార్లమెంట్ పరిధిలో అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుండగా, అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి సీఎం రమేశ్ బరిలో నిలిచారు. ఇక పొలిటికల్ కేపిటల్ విజయవాడలోనూ జనసేన సింబల్ టీడీపిని ఇరుకునపెడుతోంది. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నవతరం పార్టీ అభ్యర్థి కృష్ణ కిషోర్ కు గాజు గ్లాస్ కేటాయించారు. గుంటూరు, బాపట్లలో సునాయశంగా గెలుస్తామన్న దీమాలో ఉన్న టీడీపీకి ఇప్పుడు గాజు గ్లాస్ సింబల్ కలవరపాటు కలిగిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఈసారి సత్తా చాటాలని భావిస్తున్న టీడీపీకి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో బలిజలు ఓట్లు ఒకవేళ గ్లాస్ గుర్తుకుపడతాయేమోనన్న కంగారుంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు సుమారుగా 50 చోట్ల స్వతంత్రులకు, రెబల్స్‌కు గాజు గుర్తు కేటాయించగా, మరికొందరికి కూడా గాజు గ్లాస్ దక్కిందన్న ప్రచారం కూడా ఉంది.