సిబ్బంది ఉన్నా, పింఛన్ ఇంటికి పంపించరా? ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
పింఛన్‌దారులకు ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ ఇవ్వాల్సిందిగా టీడీపీ కోరుతున్నా, అధికారులు ఎందుకలా చేయడం లేదని ప్రశ్నించారు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. పింఛన్ల నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని ఇదేం పద్ధతని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పుకోవడం సబబా ఆయన ఆక్షేపించారు. కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు భాగస్వాములు కావడం దురదృష్టకరమన్నారు. సిబ్బంది ఉన్నా ఇళ్లకు వెళ్లి పింఛన్ ఎందుకివ్వరని ఆయన మండిపడ్డారు. ఒక అధికారి 45 మందికి పింఛన్ ఇస్తే సరిపోయేదానికి ఇలా చేయడమేంటని దుయ్యబట్టారు. ఈసీ చెబుతున్నా పట్టించుకోవడం లేదని, కుంటిసాకులతో తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.

పింఛన్ల పంపిణీ విషయం ఏపీలో మరోసారి రచ్చకు కారణమవుతోంది. ఇప్పటికే గత నెలల జరిగిన పరిణామాలను మరచిపోకముందే, మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీలో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని, ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో పింఛన్ తీసుకునేవారు సమీప సచివాలయాలకు వెళ్లి తీసుకోవాల్సిందిగా కోరింది. ఐతే ఎండల దెబ్బతో గత నెలలో 30 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పుడు పింఛన్ల పంపిణీపై ఈసీ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నాయి. పింఛన్ నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించాయి. అకౌంట్లు లేని వారికి నేరుగా వారి ఇళ్ల వద్ద ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. అయితే తిరిగి బ్యాంక్‌కు వెళ్లి డబ్బు తీసుకోవడం ఇబ్బందవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇది అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య వాగ్వాదానికి కారణమవుతోంది.