ఎన్నికల బరిలో హత్య కేసు నిందితులు కోడికత్తి శ్రీను, దస్తగిరి
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసి సంచలనం సృష్టించిన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు లోక్ సభ ఎన్నికల బరిలో నిలవబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన జైభీమ్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అమలాపురం నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. జైభీమ్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్, కోడికత్తి శ్రీనును పార్టీలో చేర్చుకున్నారు. విజయవాడలో ఆయన జైభీమ్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మాజీ ఎంపీ వివేక హత్య కేసులో నిందితుడు దస్తగిరి సైతం జైభీమ్ పార్టీలో చేరారు. వివేక హత్య కేసులో అప్రువర్ గా మారి ఆయన వైఎస్ కుటుంబీకులే, వివేక హత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిపై పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. వివేక అభిమానులు వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తారని దస్తగిరి చెబుతున్నాడు.

