ఎ రాజా వ్యాఖ్యలను సమర్థిస్తారో లేదో చెప్పండి.. కాంగ్రెస్ను ప్రశ్నించిన బీజేపీ
డిఎంకె నాయకుడు ఎ రాజా ‘జై శ్రీరామ్’, భారతదేశం ఆలోచనపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఐతే ఈ వ్యాఖ్యలు ఏ రాజా వ్యక్తిగతమైనవన్నారు ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వి యాదవ్. ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిని ప్రతిబింబించవన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత ప్రకటనగా చూడాలని కోరారు. మరోవైపు ఎ రాజా వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా. రాజా చేసిన వ్యాఖ్యలను టాగ్ చేసి నిప్పులు చెరిగారు. భారతదేశాన్ని బాల్కనైజేషన్ కోసం రాజా పిలుపునిచ్చారని, రాముడిని అవహేళన చేశారని, మణిపురిలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని… ఒక దేశంగా భారతదేశం అనే ఆలోచనను ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. డీఎంకే ద్వేషపూరిత ప్రసంగాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చిన తరువాత, భారతదేశాన్ని బాల్కనైజేషన్ చేయాలని రాజా పిలుపునిచ్చారని… భగవాన్ శ్రీరాముడ్ని అవహేళన చేస్తూ, మణిపురిలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి, ఇండియా స్ఫూర్తిని ప్రశ్నిస్తున్నాడని అమిత్ మాల్వియా దుయ్యబట్టాడు. రాజా వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు మౌనం దాల్చారని.. అంటే వారు ఆ వ్యాఖ్యలను ఏకీభవిస్తారా అంటూ విరుచుకుపడ్డాడు.

మరోవైపు రాజా వ్యాఖ్యలను సమర్థిస్తారో లేదో చెప్పాలని బీజేపీ సీనియర్ నేత, లోక్సభ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ వ్యాఖ్యలను తాము ఎన్నటికీ అంగీకరించబోమని రాజా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా… ? డీఎంకే ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలను ఉపయోగిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇతర మతాల దేవతలను దూషిస్తుంటే అంటూ ఆక్షేపించారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అంతకుముందు, అమిత్ మాల్వియా మధురైలో డిఎంకె నేత ఎ రాజా చేసిన ప్రసంగాన్ని పోస్ట్ చేశారు.
భారతదేశం ఒక దేశం కాదు. దీన్ని బాగా అర్థం చేసుకోండి. భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదు. ఒకే దేశం అంటే ఒకే భాష, ఒకే సంప్రదాయం మరియు ఒకే సంస్కృతి. అప్పుడు మాత్రమే అది ఒక దేశం. భారతదేశం ఒక దేశం కాదు, ఉపఖండం. కారణం ఏమిటి? ఇక్కడ తమిళం ఒక దేశం, ఒకే దేశం. మలయాళం ఒకే భాష, ఒకే దేశం, ఒరియా ఒక దేశం, ఒక భాష, ఒక దేశం. ఈ దేశాలన్నీ భారతదేశాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి, భారతదేశం దేశం కాదు, ఉపఖండం. ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయి. మీరు తమిళనాడుకు వస్తే, అక్కడ ఒక సంస్కృతి, కేరళలో మరో సంస్కృతి, ఢిల్లీలో మరో సంస్కృతి ఉంది. ఒరియాలో, మరొక సంస్కృతి ఉంది. ఆర్ ఎస్ భారతి చెప్పినట్టు మణిపూర్లో ఎందుకు కుక్క మాంసం తింటారు. అవును, ఇది నిజం, వారు తింటారు. అది ఒక సంస్కృతి. తప్పు ఏమీ లేదు. అదంతా మన మనసులో ఉంది.”
“వాటర్ ట్యాంక్ నుండి… వంటగదికి నీరు వస్తుంది, దానిని వంటగదిలో ఉపయోగిస్తాం, వాటర్ ట్యాంక్ నుండి అదే నీరు టాయిలెట్లోకి వస్తుంది. దానిని అక్కడే ఉపయోగిస్తాం. కానీ ఆ నీటిని వంటగదిలో ఉపయోగించం. మానసికంగా నీరు ఒకేలా ఉంటుంది… కానీ అది వచ్చే ప్రదేశానికి తేడా ఉంది. మేము రెండింటినీ అంగీకరిస్తాం. అది టాయిలెట్, ఇది వంటగది. అదేవిధంగా, కాశ్మీర్లో ఒక సంస్కృతి ఉంది. దానిని గుర్తించండి. మణిపూర్లో ప్రజలు కుక్క మాంసం తింటారు. దానిని అంగీకరిస్తారు. ఒక సమాజం గొడ్డు మాంసం తింటుంది, మీ సమస్య ఏమిటి? వారు మిమ్మల్ని తినమని అడిగారా? కాబట్టి, భిన్నత్వంలో ఏకత్వం. మాకు విభేదాలు ఉన్నాయి. దానిని గుర్తించండి” అని పోస్ట్ చేశాడు.