తెలంగాణలో బీజేపీ పక్కాగా గెలిచే సీట్లు ఇవే!?
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గెలిచే సీట్లు ఎన్ని? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉన్న సీట్లెన్ని అన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ సీట్లన్నింటినీ గెలుచుకోవాలని లక్ష్యంగా పనిచేస్తుంటే… బిజెపి సైతం హైదరాబాద్‌తో సహా అన్నీ సీట్లలోనూ తామే గెలవబోతున్నామంటోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేత హోం మంత్రి అమిత్ షా 10 సీట్లు పార్టీకి లక్ష్యంగా నిర్దేశించారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం తర్వాత.. తాము మొత్తం సీట్లను గెలుస్తామంటూ ఆ పార్టీ నేతలు దీమా ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి గెలిచే సీట్లెన్ని అన్న దానిపై ఎంతో ఉత్కంగా నెలకొంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పట్టణ ప్రాంతానికి పరిమితమైన బిజెపి, ఈసారి గ్రామాల్లోనూ పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది.

బీజేపీ ఏఏ సీట్లు గెలుస్తుందన్నదానిపై ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి 19.65 శాతం ఓట్లు వచ్చాయి. గత లోక్ సభ ఎన్నికలతో పోల్చుకుంటే సుమారుగా 9 శాతానికి పైగా ఓట్లు పెరిగాయ్. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ సంగతి పక్కనబెడితే బీజేపీకి ఈసారి మహబూబ్ నగర్ సీటు దక్కడం తేలికన్న పరిస్థితి ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నాలుగు సిట్టింగ్ స్థానాలతోపాటుగా, మరికొన్ని స్థానాలపై కన్నేసింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మల్కాజ్‌గిరి సీట్లో ఈసారి బిజెపి గెలిచి తీరాలన్న సంకల్పం తీసుకోంది. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. సుమారుగా 35 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో విజయం కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఇక మల్కాజ్‌గిరి సెగ్మెంట్లో ఈసారి విజయం నల్లేరుపై నడకేనని బీజేపీ భావిస్తోంది. ఇక్కడ్నుంచి బిజెపి సీనియర్ నేత ఈటల రాజేందర్ పోటీ దాదాపు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు బిజెపి విజయం సాధించే అవకాశం ఉన్న స్థానం చేవెళ్ల. ఇక్కడ్నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్వల్ప ఓట్లతో ఓడారు. ఈసారి ఆయన గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇంపాక్ట్ కూడా ఈ ఎన్నికల్లో ఉంటుందని.. తనకు కలిసి వస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొండా ఈసారి బిజెపి తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే సమయంలో బిజెపి సునాయాసంగా గెలిచే మరో స్థానం మహబూబ్‌నగర్. గత ఎన్నికల్లో ఇక్కడ డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థిపై హోరాహోరీ తలపడ్డారు. ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసిగా ఆమె ఉన్నారు. బిజెపి సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి కూడా గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించారు. ఈసారి బీజేపీ ఇక్కడ్నుంచి జండా ఎగురేయడం ఖాయమన్న భావన పార్టీలో ఉంది.

వీటితోపాటు బిజెపికి సానుకూలత ఉన్న సీట్లను పరిశీలిస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లని చెప్పాల్సి ఉంటుంది. మెదక్ నియోజకవర్గం గతంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గంలో గెలవాలని బీజేపీ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈసారి బీజేపీ వేవ్ ద్వారా ఆ కల సాకారం చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ జెండా పాతాలని చూస్తున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి తొలిసారి బీజేపీ జెండా ఎగురేయాలని ఆయన తహతహలాడుతున్నారు. బోర్డర్ ప్రాంతంలో ఉన్న జహీరాబాద్‌లో అటు కర్నాటక, ఇటు మహారాష్ట్ర ఇంపాక్ట్ ఉంటుందని.. ఈ స్థానంలో బీజేపీ విజయం నల్లేరుపై నడకేనని ఆ పార్టీ భావిస్తోంది. కర్నాటక, మహారాష్ట్రలో బీజేపీకి ఉన్న సానుకూలత జహీరాబాద్ లో కాషాయ జెండా ఎగురేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

ఇలా నాలుగు స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాలను సొంతం చేసుకుంది. ఈసారి బీజేపీకి దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, అయోధ్య రామమందిర నిర్మాణం, మోదీ ఇమేజ్ బలపడటంతో… తెలంగాణలో పది స్థానాల్లో విజయం తధ్యమని కాషాయ పార్టీ భావిస్తోంది. గతంలో గెలిచిన నాలుగు పార్లమెంట్ స్థానాలు, ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, జహీరాబాద్, గ్రేటర్ పరిధిలో ఉన్న మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్, వరంగల్ నుంచి సైతం విజయం సాధించాలని పార్టీ యోచిస్తోంది. ఎస్సీ నియోజకవర్గమైన వరంగల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందన్న విశ్వాసం ఉంది. మొత్తంగా బీజేపీకి అన్నీ మంచి శకునములే అన్న భావన కన్పిస్తోంది. పార్టీ ఈ ఎన్నికల్లో కీలక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్న వర్షన్ విన్పిస్తోంది.