Andhra PradeshHome Page Slider

వైసీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా, జగన్‌కు ఝలక్

ఉత్తరాంధ్ర రాజకీయనేతల్లో ఉద్దండుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం జగన్‌కు పంపించారు. ఆయనతోపాటు ఆయన తనయులు దాడి రత్నాకర్, జైవీర్ సైతం పార్టీకి రాజీనామా సమర్పించారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ సామాజికవర్గం గవర కులానికి చెందిన దాడి సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1994లో ఎన్టీఆర్ కేబినెట్ లో స్వల్ప కాలం సమాచార శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 1985, 1989, 1994, 1999లో వరుసుగా నాలుగేళ్లు అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2007లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2013లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2015లో వైసీపీకి రాజీనామా చేసి కొంత కాలం యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. జగన్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించినా, జగన్ ఎలాంటి పదవులివ్వకపోగా, కనీసం గౌరవించలేదని దాడి కుటుంబ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోయిన దాడి వీరభద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో దాడి వీరభద్రరావు, కుటుంబ సభ్యులతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆయన టీడీపీలోకి వెళ్తారా లేదంటే జనసేనలోకి వెళ్తారన్నది తేలాల్సి ఉంది. ఇటీవల ఆయన పవన్ కల్యాణ్‌తోనూ సమావేశమయ్యారు. దాడి వీరభద్ర రావు శారద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కింద దాడి వీరునూయుడు డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు.