రామభక్తులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్..రామమందిర ప్రారంభోత్సవానికి 1000 రైళ్లు
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం పూర్తయ్యింది. భారీస్థాయిలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024 జనవరి 22న పవిత్ర శ్రీరామ ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత సాధారణ పౌరులకు కూడా రాములవారి దర్శనం కల్పించాలని సంకల్పించారు. దీనితో రైల్వేశాఖ రామభక్తులకు శుభవార్త చెప్పింది. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆలయ ప్రారంభం నాటి నుండి మొదటి 100 రోజుల పాటు అయోధ్యకు 1000కి పైగా రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశవిదేశాల నుండి, దేశం నలుమూలల నుండి రామభక్తులు అయోధ్య బాట పట్టే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. జనవరి 19 నుండే ఈ రైళ్లను నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది.

దిల్లీ, ముంబయ్, చెన్నై,బెంగళూర్, కోల్‌కతా వంటి మహానగరాల నుండే కాకుండా నాగ్‌పూర్, లఖనవూ, జమ్మూ సహా వివిధ ప్రదేశాల నుండి ఈ రైళ్లను నడపనున్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం గుంపుగా, సమూహాలుగా వెళ్లే భక్తుల కోసం ఛార్టెర్డ్ సర్వీసులు, ప్రత్యేకంగా రైళ్లను ముందే బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని, డిమాండ్‌ను బట్టి రైళ్ల సంఖ్యను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 14 మకర సంక్రాంతి రోజున శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మొదలుపెట్టి 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు భావిస్తోంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 2,500 మంది ప్రముఖులకు ఆహ్వానం అందింది… ప్రధాని మోదీతో పాటు 4 వేల మంది సాధువులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

