సిద్దిపేటలో మెజార్టీ లెక్కలే ముఖ్యమా?
రాష్ట్ర రాజకీయాల్లో సిద్దిపేట చెరగని ముద్ర వేస్తోంది. ఇక్కడ విజయం సాధించినవారు రాష్ట్ర రాజకీయాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుంటారు. 1985 నుంచి 2004 వరకు కేసీఆర్ ఇక్కడ డబుల్ హాట్రిక్ సాధిస్తే.. ఇదే నియోజకవర్గం నుంచి అల్లుడు తన్నీరు హరీష్ రావు సైతం డబుల్ హాట్రిక్ నమోదు చేశారు. కేవలం ఎన్నికల్లో గెలవడమే కాదు ఎన్నిక, ఎన్నికకు మెజార్టీ రికార్డులను తిరగరాస్తూ.. నియోజకవర్గంలో ప్రత్యర్థులు ఎవరూ కూడా అటువైపు చూడకుండా ఉండేలా రాజకీయం చేయడం మనకు సిద్దిపేటలో స్పష్టంగా కన్పిస్తోంది. గత ఎన్నికల్లో హరీష్ రావు లక్షా 18 వేల 699 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గతంలో 93 వేల మెజార్టీకాగా ఈసారి ఆయన రికార్డును ఆయన బ్రేక్ చేశారు. ఇక సిద్దిపేట నుంచి పోటీ చేసేందుకు విపక్ష పార్టీ నేతలు కంగారుపడేలా పరిస్థితులు వచ్చాయంటే నియోజకవర్గంపై హరీష్ రావు ఎంతటి పట్టు సాధించారో చెప్పొచ్చు. తాజా ఎన్నికలో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ నేత పూజల హరికృష్ణ, బీజేపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి తలపడుతున్నారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏ మేరకు హరీష్ రావు మెజార్టీ తగ్గిస్తారో చూడాలి.

ఇక సిద్దిపేట్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగ్ బూత్‌లు 273 కాగా, పురుష ఓటర్లు 1,12,934 ఉన్నారు. మహిళా ఓటర్లు 1,15,520 మంది కాగా 69 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లు 2,28,523 ఉన్నారు. సిద్దిపేట్ నియోజకవర్గంలో ముదిరాజ్ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సుమారుగా వారు 15 శాతానికి చేరువలో ఉన్నారు. ఇక ముస్లింలు సైతం 11 శాతం వరకు ఉన్నారు. పద్మశాలీలు తొమ్మిదిన్నర శాతం, మాదిగలు 9 శాతం, గొల్లలు ఎనిమిదిన్నర శాతం, వైశ్యులు ఏడున్నర శాతానికి పైగా ఉన్నారు. మాలలు 7 శాతం వరకు ఉండగా, గౌడలు ఆరున్నర శాతం మేర ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం సైతం నియోజకవర్గంలో ఐదున్నర నుంచి ఆరు శాతం వరకు ఉన్నారు. మున్నూరు కాపులు నాలుగు శాతం మేర ఉండగా, లంబాడాలు మూడు శాతానికి పైగా ఉన్నారు. ఇతరులు సుమారుగా 12 నుంచి 13 శాతం ఉన్నారు.

