ఈటల రావాలి.. కేసీఆర్ పోవాలి.. నినదిస్తున్న గజ్వేల్ ప్రజానీకం
పింఛన్ రావాలన్నా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రావాలన్నా కేసీఆర్ దిగిపోవాలి
కేసీఆర్ ప్రజలను నట్టేట ముంచుతున్నాడన్న ఈటల రాజేందర్
తడిగుడ్డతో గొంతు కోసే నైజం కేసీఆర్‌ది అంటూ ఈటల మండిపాటు
గజ్వేల్ గడ్డను బాగు చేసుకునేందుకు కేసీఆర్‌ను ఓడించాలన్న ఈటల
గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం కొండపోచమ్మ గ్రామంలో ఈటల రాజేందర్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. కొండపోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి.. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు ఈటల. ఈ సందర్భంగా కొందరు కాషాయ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ తనను ఎలా అవమానించారో ప్రతి ఒక్కరు తెలిసుకోవాలని ఈటల గజ్వేల్‌లో పిలిపునిచ్చారు. బయటికి గెంటివేసి.. రాజీనామా చేస్తావా లేదా అంటే… రోషం గల బిడ్డగా రాజీనామా చేశా. ప్రజలను నమ్ముకున్నా.. నీ జేజెమ్మ దిగివచ్చినా హుజూరాబాద్‌లో గెలవలేవు అని చెప్పాను. అక్కడ, ఇక్కడ కాదు నీమీదనే పోటీ చేస్తానని ఛాలెంజ్ చేసినా. అందులో భాగంగా మీ ఒడిలోకి వచ్చానన్నారు ఈటల రాజేందర్. బాజప్తా కేసీఆర్ ఇచ్చేవన్నీ తీసుకుంటాం.. కర్రు కాల్చి వాత పెడతాం అని గజ్వేల్ ప్రజలందరూ అంటున్నారన్నారు ఈటల.

9 ఏళ్లుగా మా గజ్వేల్ ప్రజల వైపు చూసిన పాపాన పోలేదని, ఏనాడు కలవలేదని, ప్రజలను పట్టించుకోలేదని… వచ్చిపోయేటప్పడు… రోడ్డుపై జామకాయలు, మక్కలు అమ్ముకునే వాళ్ళను పొలీసు పెట్టుకోనివ్వలేదని వాపోతున్నారన్నారు. భూములు గుంజుకొని పేదల బతుకుల్లో కేసీఆర్ మట్టి కొట్టాడన్నారు. 20 ఎకరాల ఆసామి కూడా ఆర్ అండ్ ఆర్ కాలనీలో మగ్గుతున్నారని… కేసీఆర్ తీరుతో 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. బీజేపీని మీరు ఆశీర్వదిస్తే కేసీఆర్ గుంజుకున్న భూములన్నీ వెనక్కి ఇప్పిస్తామన్నారు. గజ్వేల్ ఆడబిడ్డల్లారా.. అన్నదమ్ముల్లారా, యువకుల్లారా మీకు అండగా ఉంటా. సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈటల విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ ఓడిపోకపోతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రావని, 57 ఏళ్లకే పెన్షన్ రాదని, బీజేపీని ఆశీర్వదించండి అన్ని అందించే భాద్యత తీసుకుంటామన్నారు. పేదల ఆకలి తెలిసిన వాళ్లమన్నారు ఈటల. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి కానీ అమలు కావన్నారు. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే… కానీ ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చారా అని స్థానికులను ఈటల ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించిన పాపానికి 30 వేల కుటుంబాల స్థలాలు గుంజుకున్నారని, ఎకరానికి 6 లక్షల రూపాయలు ఇచ్చి.. భూములు లాక్కొని కోటి రూపాయలకు అమ్ముకున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదల జీవితాలు బాగుపడతాయన్నారు ఈటల. బీజేపీ అధికారంలోకి వస్తే, ముసలి వాళ్లు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. ఆడబిడ్డలకి వడ్డీ లేని రుణాల బకాయి చెల్లిస్తామన్నారు.

తరుగులేకుండా వడ్లు కొనుగోలు చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో నౌకర్లు లేవు.. కేసీఆర్ హయాంలో అన్ని పేపర్లు లీకు అయ్యాయన్నారు. బ్రోకర్లకి నౌకర్లు వస్తాయని కేసీఆర్ నిరూపించారని మండిపడ్డారు. గుండె పగిలి చచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. పేద కుటుంబంలో ఉన్న పెద్ద చనిపోతే ప్రమాద బీమా అందిస్తామన్న ఈటల, కౌలు రైతులకు అండగా ఉంటామన్నారు. పేదల బాధలు తెలిసినవాణ్ణి, ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఈటల స్థానికులకు విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా నేను ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలుసునన్నారు.