కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లు..బంకర్లలో ప్రజలు
జమ్మూకాశ్మీర్లోని అర్నియా సెక్టార్లో సరిహద్దు వెంబడి ఐదు భారత్ స్థావరాలపై పాకిస్థాన్ రేంజర్లు గురువారం రాత్రి అకారణ కాల్పులకు తెగబడ్డారు. దీనితో భయాందోళనలకు గురైన స్థానిక ప్రజలు బంకర్లలోకి పరుగులు పెట్టారు. ఈ కాల్పులు శుక్రవారం తెల్లవారుజాము దాకా కొనసాగాయి. బుల్లే చక్ గ్రామానికి చెందిన ప్రజలు మోర్టార్ షెల్స్ రావడంతో భయంతో పరుగులు తీశారు. ఈ సరిహద్దు ప్రాంతాలలో ఎప్పుడూ ఉగ్రవాదుల బెడద ఉండడంతో బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా వాటిని వాడవలసిన అవసరం రాలేదని, కానీ గత రాత్రి జరిగిన ఆకస్మిక కాల్పుల కారణంగా రావలసి వచ్చిందని వారు మీడియాతో గోడు వెళ్లబోసుకున్నారు. ఆ ఊర్లో అన్నీ పక్కా ఇళ్లు కావడంతో మోర్టార్లు తాకితే ధ్వంసమవుతాయన్నారు. ఈ కాల్పులకు బీఎస్ఎఫ్ జవాన్లు కూడా రంగంలోకి దిగి జవాబు చెప్పారు. ఇరువైపులా కాల్పులతో ఆప్రాంతం దద్దరిల్లింది.