Home Page SliderTrending Today

బ్రేస్‌లెట్ తరహా స్మార్ట్‌ఫోన్‌.. మోటో కొత్త కాన్సెప్ట్ మొబైల్

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా కొత్తరకం మొబైల్‌ని తీసుకొచ్చింది. అది ఎలా ఉంటుందంటే..?

ప్రస్తుతం మార్కెట్‌లో ఫోల్డబుల్ ఫోన్ల హవా ఎక్కువగా ఉంది. ఇప్పటికే పలు కంపెనీలు మడతపెట్టే ఫోన్లపై దృష్టి సారించాయి. ఈ సమయంలో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరోలా మరో కొత్త కాన్సెప్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. తన మాతృసంస్థ లెనోవా టెక్ వరల్డ్ 2023 ఈవెంట్‌లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించింది.

    ఇప్పటివరకు మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లు విపణిలో అందుబాటులోకి వచ్చాయి. అయితే మోటోరోలా కాన్సెప్ట్ ఫోన్‌ మాత్రం అందుకు భిన్నం. కేవలం ఫోల్డబుల్ ఫోన్లలా మడతపెట్టడమే కాదు.. దీన్ని సులువుగా రోల్ చేసేయొచ్చు. చేతికి బ్రేస్‌లెట్ వేసుకున్నట్లుగా మణికట్టుకు చుట్టొచ్చు. వినియోగదారుల అవసరానికి తగినట్లుగా ఎలా కావాలంటే అలా వివిధ రూపాల్లోకి మార్చుకోవచ్చు. వీడియో కాల్ మాట్లాడటానికి, సోషల్ మీడియా స్క్రోలింగ్ వంటి వాటికి ఈ ఫోన్ ఉపయోగకరంగా ఉంటుందని మోటోరోలా తెలిపింది. ఇది 6.9-అంగుళాల ఫుల్ హెచ్‌డీ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేతో మార్కెట్లోకి రానుంది.

అంతేకాదు ఇందులో వినియోగించిన ఏఐ టెక్నాలజీ సాయంతో ఫొటోలు తీయటం సులువు. నలిగిపోయిన పేపరు ఫొటోలు తీసినా ముడతలు లేకుండా నీడ కనబడకుండా స్పష్టంగా చిత్రించవచ్చని కంపెనీ తెలిపింది. మీరు ధరించిన దుస్తుల ఫొటోలను అప్‌లోడ్ చేసి ఏఐ జనరేట్ వాల్‌పేపర్‌గా మార్చుకోవచ్చు. అలాగే మొబైల్ ఫోన్‌లో స్క్రీన్ షాట్ తీసి.. అందులోని సున్నితమైన కంటెంట్‌ని బ్లర్ చేయొచ్చు. అయితే ఇది కేవలం నమూనా ఫోన్ మాత్రమే. కాబట్టి దీని ధర, ఎప్పటినుండి అందుబాటులోకి రానుందనే విషయాన్ని మోటోరోలా చెప్పడంలేదు.