మహిళలే మహా రాణులు …ఐజాల్‌లో శనివారం సంత…!
మిజోరాం రాష్ట్ర రాజధాని .. ఐజాల్‌లో … రిపబ్లిక్ వెంగ్ (లోకాలిటీ).. ప్రభుత్వ కళాశాల కూడలి!
అక్టోబర్ 7 వ తేదీ శనివారం.. ఉదయం 5 గంటలకు.. నేనూ , మా మేడమ్ వాకింగ్ కోసం మా బస నుండి రోడ్డు మీదకు వచ్చాం! కళాశాల ఎదురుగా కోలాహలంగా ఉంది! జనం గుంపులు గుంపులుగా రోడ్డుపక్కన నిలబడి ఉన్నారు! సుమో , మహేంద్ర వాహనాల్లో వారు పెద్ద పెద్ద లగేజీలతో ఎక్కడం కనిపించింది! ఒక కుర్రాడిని విషయం ఏమిటని అడిగాను! వారాంతపు సెలవు కోసం ఇంటికి పోతున్నాం అన్నాడు! ఐదురోజుల వారం పద్దతి అక్కడ అమల్లో ఉంది! తాను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ శిక్షణకోసం ఐజాల్ లో ఉంటున్నాడట!

చదువుకోసమో , ఉద్యోగం కోసమో , శిక్షణకోసమో, ఐజాల్ లో ఉండేవారంతా వారాంతపు సెలవులకు తమ,తమ స్వస్థలాలకు పోతుంటారట! అంత పొద్దున్నే వందలాది మందిని ప్రయాణపు హడావుడిలో చూసి ముచ్చట పడ్డాను! బ్రేక్ ఫాస్ట్, టీ, కాఫీ , అమ్మే మహిళలు హుషారుగా అమ్మకాలు సాగిస్తున్నారు! మా మేడమ్ , నేనూ వాకింగ్ కోసం ముందుకు కదిలాం ! రోడ్డు మార్జిన్లో ఫుట్ పాత్ పై కూరగాయల దుకాణాలు వరుసగా కనపడ్డాయి! వాటిని చూసుకుంటూ నడుస్తూనే ఉన్నాం! కూరగాయలు అమ్ముతూ మహిళలు బిజీగా సందడిగా ఉల్లాసంగా ఉన్నారు ! కొనుక్కోవడానికి కూడా మహిళలే అధికసంఖ్యలో రావడం చూశాం! వాతావరణం అంతా ఉత్సాహంగా ఉంది! మహిళల కోలాహలం ఎక్కువగానే ఉంది!

సుమారు కిలోమీటరు పొడవునా ఫుట్ పాత్ పై కూరగాయల దుకాణాలు ఉన్నాయి! కూరగాయలు , వాటి ధరలు కనుక్కుంటూ మేం ముందుకు సాగాం! మాఇంగ్లీషు ఉచ్ఛారణ దుకాణదారులకు గానీ , వాళ్ళ ఉచ్ఛారణ మాకుగానీ అర్థం కావడంలేదు! అయినా పట్టు వదలకుండా వాళ్ళతో మేం మాట్లాడుతూనే ఉన్నాం! వాళ్ళు మిజో భాషలో సమాధానం ఇస్తున్నారు! మామీద వాళ్ళు జోకులు వేసుకుంటున్నారో ఏమో గానీ … మేం మాట్లాడాక పెద్దగా పక పకా నవ్వుతూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టేవారు.\

మా అవస్థ చూసి మిజోరాం యూనివర్సిటీ ఉద్యోగి ఒకరు మాకూడా వస్తూ అన్నీ వివరించి చెప్పారు! ఐజాల్ నగరంలో ప్రతీ శనివారం కూరగాయల సంత జరుగుతుందని ఆయన చెప్పారు! అక్కడ అమ్మే కూరగాయలన్నీ గ్రామీణప్రజలు తమ సొంతపొలాల్లో , ఇంటి పెరడుల్లో పెంచినవి! వారు రసాయనిక ఎరువులు , పురుగుమందులు వాడరు! శనివారం సంతలో అమ్మేవన్నీ ఆర్గానిక్ ఉత్పత్తులే!

మగవాళ్ళు పొలంపనుల్లో ఉంటారు కాబట్టి , కూరగాయలు అమ్ముకోవడానికి మహిళలే సంతకు వస్తారు! శుక్రవారం రాత్రి వారు గ్రామాల నుంచి ఐజాల్ చేరుకుంటారు! ఫుట్ పాత్ మీదనే పడుకుని శనివారం పగలంతా కూరగాయలు అమ్ముకుని , రాత్రికి ఇంటికి వెళ్ళిపోతారు! వాళ్ళ అమ్మకాలు మూడు నుంచి ఐదు వేల రూపాయలు వరకూ ఉంటాయి! పోలీసులు గానీ , మునిసిపల్ అధికారులు గానీ వారిని ఇబ్బంది పెట్టరు! మునిసిపాలిటీ మాత్రం ప్రతీ అమ్మకందారుని నుండి ఇరవైరూపాయల పన్ను వసూలు చేస్తుంది!ఆ సొమ్ముతో సంత ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను చేపడతారు! మాతోపాటు ఆయన చాలా దూరం నడిచి వచ్చారు! ఆయన సతీమణి వారానికి కావలసిన కూరగాయలు కొనుక్కోవడంలో నిమగ్నం అయ్యారు!

ధరలు కనుక్కుంటే కాస్త ఎక్కువే అనిపించాయి! ధరలు ఎక్కువైనా ఆర్గానిక్ ఉత్పత్తులు కాబట్టి తాము శనివారం సంతలోనే కొంటామని ఆయన అన్నారు! ఉల్లిపాయలు కిలో 60 , బంగళా దుంపలు 50 , వంకాయలు 80 , బెండకాయలు 80, కీరా 50., క్యాబేజీ 60, కాకరకాయలు120, క్యారట్ 200, కొత్తిమీర చిన్నకట్ట 50 , ఆకుకూర కట్ట 30, మష్రూమ్స్ కిలో 120 , తేనెతుట్ట 50 , గుమ్మడిముక్కల ప్యాకెట్ 50 , అరటిదూట ప్యాకెట్ 30 , అరటిపూవు 25 , ఉల్లికాడల కట్ట 40 , ఉల్లివేర్ల కట్ట 40 , నల్లేరుకాడలు కట్ట 60 , ఆగాకర 80 , బూడిదగుమ్మడి ముక్కలు 50 , ప్యాప్సికమ్ 80 , కింగ్ మిర్చి కిలో పెద్దవి 120 , సన్నమిర్చి ప్యాకెట్ 30, గజ నిమ్మకాయలు డజను 60 , అల్లం 150 , వెల్లుల్లి ప్యాకెట్ 60 ,రాజ్మా , బొబ్బర్లు , పచ్చిబఠాణీ వంటి గింజలు రెండు సోలడబ్బాలు 50 , పచ్చి వేరుసెనగ గింజలు ప్యాకెట్ 50 , మిజో ఎర్రబియ్యం రెండుకిలోల ప్యాకెట్ 250 , బీఫ్ 500 , మటన్ 700 , పోర్క్ 700 , చికెన్ 350 చొప్పున అమ్ముతున్నారు!

పేరు తెలియని స్థానిక రకాల ఆకుకూరలు తాజాగా ఉండటంతో ప్రతి ఒక్కరూ కొనుక్కోవడం కనిపించింది!గంటసేపు నడిచి వెనక్కి తిరిగి వస్తుంటే రోడ్డుకి అటువైపు మార్జిన్ లో కూడా కూరగాయల దుకాణాలు పెద్దసంఖ్యలో కనిపించాయి! మెయిన్ రోడ్ నుండి అటూ ఇటూ పోయే సందుల్లో కూడా కూరగాయల దుకాణాలు కనిపించాయి! జనం అంత పొద్దున్నే కూరగాయలు కొనుక్కోవడానికి రావడం విశేషమే అని చెప్పాలి! అక్కడక్కడ చాయ్, నిమ్మరసం , పళ్ళ రసాలు అమ్మే బడ్డిలు ఉన్నాయి! కొన్నిచోట్ల రోడ్డుపై గుడ్డపట్టా వేసి దానిపై గుట్టగాపోసిన బట్టల్నీ అమ్మే మహిళలు కూడా కనబడ్డారు! పూల మొక్కలు , పూలు , పండ్లు అమ్మే మహిళలు కూడా కనబడ్డారు!

కొన్ని రాష్ట్రాల్లో ఉదయపు జీవితం ఆలస్యంగా మొదలు అవుతుంది! కానీ ఐజాల్ లో తెల్లవారు ఝామునే జీవితం హుషారుగా మొదలయ్యింది! ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని తెగల జీవితంలో మహిళలపాత్ర గణనీయంగా ఉంటుందని తెలిసిందే!మిజో మహిళలు కూడా ఆర్థిక సామాజిక జీవనంలో మహారాణులేనని శనివారం సంత చూసాక మరోసారి ధ్రువపడింది ! ఎనిమిదిగంటల ప్రాంతంలో ఐజాల్ ప్రభుత్వకళాశాల ఎదురుగా ఉన్న మాబసకు తిరిగి చేరుకున్నాం !
డి.సోమసుందర్
సీనియర్ పాత్రికేయుడు
07-10-2023, సాయంత్రం 4 గం.లు, ఐజాల్

