Home Page SliderInternational

ఐఫోన్ 12 చాలా ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తుందా? నిజమేంటి?

2020లో విడుదలైన యాపిల్ ఐఫోన్ 12 రేడియేషన్ లీక్ అవుతోందన్న ఆరోపణలతో వివాదంలో చిక్కుకుంది. ఎక్కువ రేడియేషన్ కిరణాలు విడుదల చేస్తోందని గాడ్జెట్‌ను విక్రయించడాన్ని నిలిపివేయాలని ఫ్రాన్స్, ఆపిల్‌ను కోరింది. అయితే ఆపిల్ సంస్థ మాత్రం… ఐఫోన్ తయారీ ప్రపంచ రేడియేషన్ ప్రమాణాలను అనుసరించి తయారు చేశామని, నిబంధనల మేరకు మాత్రమే రేడియేషన్ ఉందని స్పష్టం చేసింది. వండర్లస్ట్ ఈవెంట్‌లో ఆపిల్ తన తాజా iPhone 15 ను విడుదల చేస్తున్న సమయంలో ఈ వివాదం రాజుకోవడం కంపెనీకి ప్రతికూలంగా మారింది. ఆపిల్ తన ఆదాయంలో 80% పైగా ఉన్న గాడ్జెట్ అమ్మకాలు క్షీణించడం గురించి ఇప్పటికే ఆందోళన చెందుతున్న సమయంలో తాజా సమస్య… ఐఫోన్ విక్రయాలపై ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆరోపణలు ఏమిటి?
ఫ్రాన్స్ ఇప్పటి వరకు 141 సెల్‌ఫోన్‌లను పరీక్షించింది. ఐఫోన్ 12ను చేతిలో పట్టుకున్నప్పుడు లేదా జేబులో ఉంచుకున్నప్పుడు, దాని రేడియేషన్ స్థాయి.. మనుషులు శరీరం గ్రహించే రేడియేషన్ కొలత కిలోగ్రాముకు 5.74 వాట్స్ ఉంది. ఐతే యూరోపియన్ యూనియన్ నిర్దేశించిన కిలోగ్రాముకు 4 వాట్స్ కంటే ఎక్కువ ఉందని నిర్ధారణయ్యింది. నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ Apple ఇప్పటికే వాడుకలో ఉన్న ఫోన్‌లలో లోపాన్ని వేగంగా పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని కోరింది. అలా కుదరనిపక్షంలో ఇప్పటికే విక్రయించిన పరికరాలను రీకాల్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఐఫోన్ 12ని పరీక్షించాలని ఫ్రాన్స్ ఎందుకు నిర్ణయించుకుంది?
వివిధ ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ పరికరాలపై తమ భద్రతా స్థాయిలను కొలవడానికి అనేక పరీక్షలను నిర్వహిస్తుంటాయి. అయినప్పటికీ, ఐఫోన్ 12 ఫ్రెంచ్ ఏజెన్సీ తాజా రౌండ్ పరీక్షలలో ఎందుకు పాస్ కాలేకపోయిందన్నదానిపై ఎంతో అస్పష్టత నెలకొంది. ఈ ఒక్క మోడల్ మాత్రమే ఇలా టెస్టులు ఫెయిల్ అవుతోంది. ఐతే, ఫోన్ రేడియేషన్ స్థాయి శాస్త్రీయ అధ్యయనాల కంటే చాలా తక్కువగా ఉందని ఫ్రాన్స్ డిజిటల్ మంత్రి అంగీకరించారు. మొత్తం వ్యవహారంపై స్పందించేందుకు ఆపిల్‌ సంస్థకు రెండు వారాల సమయం ఇచ్చినట్టు ఆయన చెప్పారు.

ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ గురించి WHO ఏం చెబుతుంది?
మొబైల్ ఫోన్‌లు ఉపయోగించే పౌనఃపున్యాల వద్ద విడుదలయ్యే శక్తిలో ఎక్కువ భాగం చర్మం, ఇతర ఉపరితల కణజాలాల ద్వారా గ్రహించబడుతుంది. ఫలితంగా మెదడు లేదా ఏదైనా అంతర్గత అవయవంలో “తక్కువ ఉష్ణోగ్రత” మార్పు వస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఫీల్డ్‌లు హృదయ స్పందన రేటు, రక్తపోటు, నిద్ర నాణ్యత, మెదడులోని విద్యుత్ కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తాయో అనేక అధ్యయనాలు పరిశీలించాయి. WHO ప్రకారం, తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల ఎలాంటి ప్రతికూల ఆరోగ్య పరిస్థితులు తలెత్తవు.

నిబంధనల ప్రకారమే ఐఫోన్ 12 తయారీ

మరోవైపు ఆపిల్ తన ఐఫోన్ 12 మోడల్‌ను సమర్థించింది. ఫోన్, గ్లోబల్ రేడియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా బహుళ అంతర్జాతీయ సంస్థలచే ధృవీకరించబడిందని తెలిపింది. థర్డ్-పార్టీ ల్యాబ్ ఫలితాలు,రేడియేషన్ ప్రమాదకర స్థాయిలో లేదని ధ్రువీకరించిందని పేర్కొంది. ఫ్రెంచ్ ప్రభుత్వ సంస్థలకు దీనిపై రిపోర్ట్ ఇచ్చాయంది.