ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో స్వీప్ చేస్తాం-ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనన్నారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు 90% హామీలు అమలు చేయలేదని, ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు మరోసారి ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు ఉత్తమ్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పాత పింఛన్ విధానాన్ని అమలు చేసి తీరుతామన్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. తాను హుజూర్ నగర్ నుంచి, తన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. అభ్యర్థుల ఎంపిక తొందరగా ఖరారు చేయాలని ఏఐసీసీకి ఆయన విజ్ఞప్తి చేశారు. టిక్కెట్లు తొందరగా ప్రకటిస్తే ప్రచార వేగాన్ని పెంచుతామని చెప్పారు. అయితే వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ చర్చలు ఏ విధంగా ఉన్నాయన్న విషయం తనకు తెలియదన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్, కోదాడ నుంచి తాము 50 వేల పైచిలుక మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పారు. 50 వేల కంటే తక్కువ మెజార్టీ వస్తే రాజకీయాల్లో ఉండనన్నారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెబితే పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో స్వీప్ చేస్తామని ఉత్తమ్ దీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు.


