బీఎస్, ఎంఎస్‌లుగా మారనున్న సాధారణ డిగ్రీలు
ఇకపై భారత్‌లో కూడా అమెరికా తరహాలో డిగ్రీల పేర్లు బీఎస్, ఎంఎస్‌లుగా మార్చాలని యూజీసీ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టుల ప్రకారం డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీలకు సంబంధించిన ఆనర్సు కోర్సులను బీఎస్, ఎంఎస్ అని పిలుస్తారు. నూతన విద్యావిధానం అమలుపరచాలని ఈమధ్యనే కేంద్రం నిర్ణయించింది. దీనితో విద్యార్థులకు వారికి నచ్చిన కోర్సులను, ఇష్టమైన సబ్జెక్టులను తీసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కామర్స్ విద్యార్థికి ఫిజిక్స్‌లో ఆసక్తి ఉంటే దానిని కూడా డిగ్రీలో తీసుకోవచ్చు. అలాగే సైన్సు విద్యార్థికి హిస్టరీపై ఆసక్తి ఉంటే దానిని ఆప్షనల్‌గా ఎంచుకునే వీలు ఉంది. అంతర్జాతీయ విద్యాప్రమాణాలకు తగినట్లు భారత్‌లో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో జాతీయ నూతన విద్యావిధానంలో దీనిని ప్రతిపాదించారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్ స్పెషలైజేషన్ చేయాలనుకుంటే వారు ఆ సబ్జెక్ట్‌లో బీఎస్ ఇన్ హిస్టరీ, ఎంఎస్ ఇన్ హిస్టరీ అంటూ పేర్కొనవచ్చు. డిగ్రీలో మూడేళ్ల కోర్సుకు మాత్రం ప్రస్తుతం ఇది వర్తించదు. కేవలం నాలుగేళ్ల కోర్సు కలిగిన ఆనర్స్ విధానానికే దీనిని అమలు పరచాలని కమిటీ సిఫార్సు చేసింది. మూడేళ్ల కోర్సులు ఇప్పటిలాగే బీఏ, బీకాం, బీఎస్సీలుగానే పిలువబడతాయి.