సమయం లేదు బాబు గారూ… త్వరపడండి.. ఏదో ఒకటి తేల్చండి!
టీడీపీ త్వరలో ఎన్డీఏ గూటికి చేరబోతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆసక్తిర వ్యాఖ్యలు చేయలేదు. టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరుతుందా అంటే ఆయన ఆచితూచి స్పందించారు. విశాఖలో చంద్రబాబు మాట్లాడుతూ మొత్తం వ్యవహారంపై దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఓవైపు ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో వైసీపీని ఓడించాలంటే అన్ని పక్షాలు కలవాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గగ్గోలు పెడుతుంటే, చంద్రబాబు మాత్రం మొత్తం వ్యవహారంపై స్పందించారు. టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరికపై సరైన సమయంలో దీనిపై మాట్లాడతానంటూ బదులిచ్చారు. టీడీపీ ఎన్డీఏలో ఎప్పుడు చేరుతుందన్న ప్రశ్నకు సరైన సమయంలో దీనిపై మాట్లాడతానని ఆయన ఏఎన్ఐతో అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజన్-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేసిన అనంతరం చంద్రబాబు ఏఎన్‌ఐతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం నిరాకరించడాన్ని నిరసిస్తూ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) వ్యవస్థాపకులలో ఒకరైన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి నుంచి బయటకు వచ్చింది. 2024లో జాతీయ రాజకీయాల్లో తన పాత్ర చాలా స్పష్టంగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. “నా ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్. ఇది నా పెద్ద ఎజెండా. రాష్ట్ర పునర్నిర్మాణం, పునర్నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాను” అని టీడీపీ అధినేత అన్నారు. అమరావతి రాజధాని విషయమై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కూర్చున్నారు, సచివాలయంలో కూర్చున్నారు, కేబినెట్ సమావేశాలను నిర్వహిస్తున్నారు.. ఇది తాత్కాలికమా? అంటూ ఆయన ప్రశ్నించారు. గత పదేళ్లుగా అవి పనిచేస్తునే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి రాజధానిని ప్లాన్ చేశానన్న చంద్రబాబు, హైదరాబాద్‌కు అత్యుత్తమ రాజధానిగా క్రమపద్ధతిలో ప్లాన్ చేశానన్నారు.

మొత్తంగా చంద్రబాబునాయుడు గందరగోళంగా ఉన్నారనిపిస్తోంది. ఏపీలో పొత్తుల ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవొచ్చన్న భావన ఇప్పుడు సర్వత్రా నెలకొంది. వైసీపీ ఒంటరిగా వస్తానంటోంది. అదే సమయంలో అందరం కలిసికట్టుగా వైసీపీని ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపునిస్తున్నారు. అయినప్పటికీ పొత్తుకు సంబంధించి నేపథ్యం మాత్రం సెట్ కావడం లేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న వర్రీ చంద్రబాబులో ఉన్నట్టుగా కన్పిస్తోంది. ఓవైపు ఏపీలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అయినప్పటికీ.. వచ్చే రోజుల్లో వైసీపీని ఓడించాలంటే కేంద్రం అండ ఎంతో అవసరమన్న భావన మాత్రం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్నికల సంఘం.. ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున చంద్రబాబు మొత్తం వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలన్నదానిపై తర్జనభర్జనపడుతున్నారు. ఐతే ఇంకా ఆలస్యం చేస్తే వచ్చే ఎన్నికల్లో అసలుకే ఎసరవుతుందన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో ఉంది.

