లోక్ సభ ఎన్నికలకు ముందు మోదీ పంచ హామీల భరోసా
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐదో ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక వాగ్దానాలు చేశారు. 13,000-15,000 కోట్ల కేటాయింపుతో సంప్రదాయ నైపుణ్యాలు కలిగిన వారి కోసం, ప్రభుత్వం వచ్చే నెలలో విశ్వకర్మ పథకాన్ని ప్రారంభిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం ముఖ్యంగా ధోబీలు, స్వర్ణకారులు, క్షురకులు మొదలైన నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం ఉంటుందన్నారు. జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. అందరికీ అందుబాటు ధరలో జనరిక్ మందులను అందుబాటులో ఉంచేందుకు ‘జన్ ఔషధి కేంద్రాలు’ ఏర్పాటు చేస్తామన్నారు. మధుమేహం ఉన్నవారు నెలకు ₹ 3,000 ఖర్చు చేయాల్సివస్తోందని… కానీ జన్ ఔషధి కేంద్రాల ద్వారా, ₹ 100 విలువైన మందులు ₹ 10-15కి ఇస్తారన్నారు. ” నగరాల్లో సొంత ఇల్లు కావాలని కలలు కంటున్న వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించనుందని ప్రధాని ప్రకటించారు. సొంత ఇల్లు లేని, పట్టణాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ద్వారా బ్యాంకు రుణాల్లో ఉపశమనం కలుగుతుందన్నారు.

వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 2014లో తాను ప్రధానమంత్రి అయినప్పుడు భారతదేశం 10వ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని, తన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేసిందో ఆయన వివరించారు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ప్రజలపై ధరల పెరుగుదల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడంలో తమ ప్రభుత్వం కొంత విజయాన్ని సాధించిందని, ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి ఎగబాకినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.