Andhra PradeshHome Page Slider

వరద సాయం అందలేదా ధైర్యంగా చెప్పండి: సీఎం జగన్

పోలవరం పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం
పోలవరం పరిహారం కేంద్రం చెల్లించినా పర్లేదు..
క్రెడిట్ కోసం పాకులాడే ప్రభుత్వం కాదు మనది.. నా ప్రజలకు మంచి జరగటమే కీలకం
నిర్వాసితులను నట్టేట ముంచిన చంద్రబాబు.. వరద ముంపు ప్రాంతాల పర్యటనలో సీఎం జగన్

“మీ బిడ్డ ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చున్న‌ది మీ కోస‌మే.. నా సంక‌ల్పం, త‌ప‌న‌, తాప‌త్ర‌యం అంతా ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌డ‌మే” అని సీఎం జ‌గ‌న్ ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి జగన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప‌ర్యటించారు. ఈ సందర్భంగా కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో సీఎం జ‌గ‌న్ ముఖాముఖి నిర్వ‌హించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.

బాధితులందరికి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు.. అధికారులు వారంపాటు గ్రామాల్లోనే

గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితిలో దాదాపుగా 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో నీళ్లు రావడంతో మన ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టంకు సంబంధించి కలెక్టర్‌కు వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇచ్చామని సీఎం జగన్ స్పష్టం చేశారు. వరదలు వచ్చినప్పుడు తాను ఫోటోల కోసం వచ్చి వెళ్లకుండా అధికారులకు అన్ని రకాలుగా అవసరమైన వనరులు ఇచ్చానని అన్నారు. వారం రోజుల పాటు అధికారులు సహాయక కార్యక్రమాల్లో అలసత్వం లేకుండా పని చేశారని, గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వాలంటీర్ల వ్యవస్థ వరకు ప్రతి వ్యవస్థను యాక్టివేట్‌ చేసి ఏ ఒక్కరికి ఇబ్బంది జరుగకుండా ఈ నాలుగేళ్ల పాలనలో చేశామని పేర్కొన్నారు. అధికారులు ఈ వారం రోజులు ప్రతి ఇంటికి వెళ్లి సహాయం అందించమని చెప్పానని, ఇందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు.

వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి నాకు చెప్పండి: సీఎం జగన్

కలెక్టర్లను అన్ని రకాలుగా ఎంపవర్‌ చేసి, వారిని యాక్టివేట్‌ చేశానని, ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా సహాయక కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్ తెలిపారు. “మీ కలెక్టర్‌ మీకు బాగానే పని చేశారా? ఎవరైనా సరే ముందుకు వచ్చి మీకు మంచి జరగకపోతే నా ఎదుటే చెప్పండి. ఎందుకు మంచి జరగలేదో నేనే అడుగుతాను. ఇంత గొప్పగా, ఇంత పారదర్శకంగా ప్రతి ఒక్కరికిమంచి జరిగించాలని తపన, తాపత్రయంతో పని చేస్తున్నది మన ప్రభుత్వం. ఇళ్లలోకి నీరు వచ్చిన పరిస్థితుల్లో ఏ ఒక్కరిని వదలకుండా నిత్యావసర సరుకులు ఇవ్వడమే కాకుండా రూ.2 వేలు సాయం చేయాలని నేను ఆదేశించాను. ఎవరికైనా ఈ సాయం అందకపోతే నాకు చెప్పండి. ఇళ్లలోకి నీరు రాకుండా మన ప్రాంతంలో వరద వచ్చినా కూడా రేషన్, నిత్యావసరాలు ఇవ్వాలని ఆదేశించాను. ఎవరికైనా సాయం అందకపోతే నాకు చెప్పండి. ఈ ప్రభుత్వం జవాబుదారీతనం తీసుకుంటాం. కచ్చా ఇళ్లు కానీ, ఇల్లు దెబ్బతిని ఉంటే అందులో వ్యత్యాసం చూపకుండా పేదవాడికి మేలు చేసేలా ప్రతి ఇంటికి రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాను. ఏ ఒక్కరి ఇల్లు దెబ్బతిన్నా కూడా సాయం అందించాలి. ఇంకా ఎవరికైనా సాయం అందకపోతే నాకే చెప్పండి”- సీఎం జగన్

ముంపు ప్రాంతాలవారికి లిడార్ సర్వే ద్వారా మంచి జరుగుతుంది

గతంలో ఇదే ప్రాంతానికి వచ్చినప్పుడు 41.15 కాంటార్‌ లెవల్‌లో లేనటువంటి పరిస్థితి లేదని, కాట్‌ ఆఫ్‌ అయిన పరిస్థితిలో తమ గ్రామాలకు వెళ్లిపోతామని చెప్పారని, అటువంటి గ్రామాలకు మంచి చేసేందుకు లిడర్‌ సర్వే చేయించానని సీఎం జగన్ పేర్కొన్నారు. పారదర్శకంగా 32 గ్రామాలను అంటే 48 పునరావాసాలను 41.15 దాకా నిలబెట్టినా కూడా ఆ మొదటి దఫా నిలబెట్టినప్పుడు కట్‌ ఆఫ్‌ అయిన జాబితాలో ఈ గ్రామాలను చేర్చాలనే ఉద్దేశంతో లిడార్‌ సర్వే ద్వారా 48 పునరావాసాలను సైంటిఫిక్‌గా తీసుకున్నామని తెలిపారు. ఈ గ్రామాల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, నీళ్లు నింపాలంటే మూడు దఫాలుగా నింపాలని, లేదంటే డ్యామ్‌ లికేజీ అవుతుంద ని అన్నారు. మొదటి దశలో 41.15 దాకా డ్యామ్‌లో నీళ్లు నింపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. కాంటూర్‌ లెవల్‌లో వచ్చే ప్రతి నిర్వాసితులకు ప్యాకేజీ ఇస్తామని, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇచ్చేవారికి పరిహారం ఇస్తామని సీఎం భరోసా ఇచ్చారు. లిడార్‌ సర్వే ద్వారా 32 గ్రామాలకు సంబంధించి మొదటి దఫాలో చేర్చామని, బాధితులకు రావాల్సిన పరిహారం ఇస్తామని అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే లిడార్‌ సర్వే పూర్తి చేయించామని తెలిపారు. ఈ నెలాఖరులోగా కేబినెట్‌ ఆమోదం పొందవచ్చని, కేంద్రం కూడా సీడబ్ల్యూసీ కూడా వారం రోజుల క్రితమే ఈ జాబితా చేరిందని సీఎం జగన్ తెలిపారు. కేంద్ర జలశక్తికి సీడబ్లూసీకి క్లియర్‌ చేసి పంపుతారని, ఈ సమస్యను కేంద్రం పరిష్కరించే దిశగా ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు.

నాకు క్రెడిట్ వద్దు, నాకు కావాల్సిందల్లా ప్రజలకు మంచి జరగటమే

“పోలవరం విషయంలో ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఒక్కటే చెప్పాను, అయ్యా..మీరే బటన్‌ నొక్కండి..మీరే నేరుగా నిర్వాసితులకు డబ్బులు జమ చేయండి. నాకు కావాల్సిందల్లా మా వాళ్లకు మంచి జరగాలి. వారికి నేరుగా డబ్బులు అందాలని ప్రధానికి చెప్పాను” అని సీఎం తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్‌ కింద ఇవ్వాల్సినవన్నీ కూడా త్వరలోనే అందుతాయని, ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఇది జరగాలని అన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మరో రూ.3.2 లక్షలు ఇస్తామని ఇప్పటికే జీఓ రిలీజ్‌ చేశామని పేర్కొన్నారు. దీనికి మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడుని ఉద్ఘాటించారు. కేంద్రం డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టగానే మీ బిడ్డ ఇవ్వాల్సిన రూ.3.2 లక్షలు ఇచ్చే కార్యక్రమం చేస్తానని, దశలవారీగా ఇచ్చుకుంటూ పోతానని స్పష్టం చేశారు. కేంద్రం కూడా త్వరలోనే స్పందిస్తుందని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కచ్చితంగా ఎన్నికలకు వెళ్లేలోపలే మంచి జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. అన్నీ కూడా వచ్చే ఆరు ఏడు నెలల్లో అందరికీ అందుతుందని సీఎం జగన్‌ తెలిపారు.

మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది మీ కోసమే

మీ బిడ్డ మీ కోసం ప్రయత్నం చేస్తున్నాడని, లిడార్‌ సర్వే చేయించి కేంద్రంపై గట్టిగా ఒత్తిడి చేయిస్తున్నానని సీఎం జగన్ వెల్లడించారు. “గత ప్రభుత్వం మాదిరిగా పోలవరం మేమే కడుతామని, కేంద్రం వద్ద అబద్ధాలు చెప్పడం లేదు. అప్పటి సీఎం చంద్రబాబు బుద్ధి లేకుండా నిర్వాసితులను మోసం చేశాడు. మీ బిడ్డ అలా చేయడు” అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇంతకు ముందు పోలవరం ప్రాజెక్టుకు నాన్నగారు వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ల్యాండ్‌ అక్విజేషన్‌ చేసినప్పుడు మొదట్లో రూ.1.50 లక్షలకు జరిగిందని అన్నారు. దాన్ని తాను చెప్పినట్లుగా రూ.5 లక్షలు ఇస్తామని, మిగిలిన రూ.3.50 లక్షలు కూడా ఇస్తానని సీఎం జగన్‌ తెలిపారు. మీ బిడ్డ వల్ల ఏ ఒక్కరూ నష్టపోయామనే మాట ఎక్కడా వినపడదని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. చేతనైతే మీ బిడ్డ మంచే చేస్తాడని, చెడు మాత్రం మీ బిడ్డ ఎప్పుడూ చేయడని సీఎం జగన్‌ కచ్చితంగా చెప్పారు.