ఢిల్లీకి వరద ముప్పు తప్పదా?
ఢిల్లీని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే.దీంతో ఢిల్లీలో జనజీవనం ఇప్పటికే అస్తవ్యస్థం అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఢిల్లీని మరో రెండు రోజుల్లో వరద తాకనుందని అధికారులు హెచ్చరించారు. ఈ భారీ వర్షాలతో ఇప్పటికే యమునా నదికి వరద ప్రవాహం పోటెత్తింది. మరోవైపు హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలతో హత్నికుండ్ బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల నీటిని అక్కడి అధికారులు దిగువకు విడుదల చేశారు. అయితే ఈ వరద నీరు మరో రెండు రోజుల్లో యమునా నదిలోకి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో యమునా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.