సరికొత్త రికార్డు సృష్టించనున్న మోదీ అమెరికా టూర్
ప్రధాని మోదీ మరోసారి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. అక్కడి అమెరికా కాంగ్రెస్‌లో ఉభయ సభలనుద్దేశించి రెండవసారి ప్రసంగించబోతున్నారు. ఇలా రెండుసార్లు అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూన్ 21 నుండి 24 వరకు వైట్‌హౌస్‌లో ఉండబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించబోతున్నారు. దీనిలో భారత్- అమెరికాల మధ్య చిరకాల సంబంధాల గురించి వివరిస్తారు.

మోదీ పర్యటన సందర్భంగా ప్రవాస భారతీయ సంఘాలు ఇప్పటి నుండి ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలను మోదీ నివసించే ప్రాంతాలలో ప్రదర్శిస్తున్నారు. పైగా బైడెన్ దంపతులు మోదీకి స్వాగతం తెలిపే సమయంలో వైట్‌హౌస్ వద్ద ఏడువేల మంది భారతీయ అమెరికన్లు సమూహంగా ప్రధానికి స్వాగతం పలుకనున్నారు. వాషింగ్టన్‌లో ప్రధాని బహిరంగసభలో ప్రవాసీయులతో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా భారతీయ వంటకాలతో మోదీ థాలీని తయారు చేస్తున్నారు భారతీయ షెఫ్‌లు.