“కేంద్ర చర్యలను భగవంతుడు చూస్తూనే ఉంటాడు” -కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిందే కేజ్రివాల్ కేంద్రప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైల్లో అనారోగ్యం పాలై, కుప్పకూలిపోయిన ఆప్ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ విషయంలో కేంద్రం వ్యవహరించినతీరుపై మండిపడ్డారు కేజ్రీవాల్. భగవంతుడు వారి చర్యలు చూస్తూనే ఉంటారని, మంచివారికి అన్యాయం జరగనివ్వడని వ్యాఖ్యానించారు. సత్యేంద్రజైన్‌కు భగవంతుడు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, పరిస్థితులతో పోరాడే శక్తినివ్వాలని పేర్కొన్నారు.

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ గత సంవత్సరం మే నెల నుండి జైలుశిక్షననుభవిస్తున్నారు సత్యేంద్రజైన్. ఈ శిక్షాకాలంలో ఏకంగా 35 కిలోలు బరువు తగ్గి తీవ్ర అనారోగ్యంతో, వెన్నుముక సమస్యలతో బాధపడుతున్నారు జైన్. తనకు బెయిల్ మంజూరు చేయమని పలుమార్లు కోర్టును మొరపెట్టుకున్నారు. తాజాగా వెకేషన్ బెంచ్‌లో ఆయన బెయిల్‌పై కేసును విచారించనున్నారు. సత్యేంద్రజైన్ ఈరోజు ఉదయం జైలులో కుప్పకూలి పోవడంతో ఢిల్దీలోని దీన దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ ప్రజలు జరిగేదంతా చూస్తున్నారని, బీజేపీ అకృత్యాలు వారికి అర్థమవుతున్నాయని వారు భగత్ సింగ్ వారసులని, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.