Home Page SliderNational

కాంగ్రెస్, బీజేపీ వెంటపడుతున్నాయ్…అవకాశం దొరికితే మోత మోగిస్తాం..!

కర్నాటకలో హంగ్ సర్కారు తప్పదన్న లెక్కలతో జనతా దళ్ సెక్యులర్ పార్టీలో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపదన్నట్టుగా నిన్న కుమారస్వామి మాట్లాడినప్పటికీ హంగ్ ఫలితాలు, మరోసారి తమను కర్నాటకలో కింగ్ మేకర్ పాత్రకు తీసుకెళ్తాయని ఆ పార్టీ విశ్వాసంగా ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో, కాంగ్రెస్, బీజేపీ రెండింటి నుండి తమకు ఫీలర్లు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జేడీఎస్ అధినేత కుమారస్వామి, రొటీన్ ఆరోగ్య పరీక్షల కోసం బుధవారం సింగపూర్‌లో ఉన్నారు.

ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ. తాము ఎవరితో భాగస్వామ్యమవాలనేది ఇప్పటికే ఖరారైందని పార్టీ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ తెలిపారు. “నిర్ణయం పూర్తయింది. ఇప్పటికే తీసేసుకున్నాం. సరైన సమయం వచ్చినప్పుడు ప్రజలకు తెలియజేస్తాం” అని ఆయన చెప్పారు. తాము JD(S)ని సంప్రదించామనే విషయమై క్లారిటీ ఇవ్వడానికి బీజేపీ అయిష్టత వ్యక్తం చేసింది. అలాంటిదేమీ లేదని కూడా తేల్చి చెప్పింది. సంకీర్ణం గురించిన ప్రశ్న ఉదయించదని, బీజేపీ, జేడీఎస్‌ను సంప్రదించలేదన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత శోభా కరంద్లాజే . “మేము ఖచ్చితంగా 120 సీట్లు గెలుస్తాం, మా కార్యకర్తల నుండి వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా పార్టీ విజయంపై దీమాతో ఉంది.” ఆమె అన్నారు.

ఐతే ప్రభుత్వ ఏర్పాటుకు తమను బీజేపీ సంప్రదించలేదని చెప్పడాన్ని జేడీఎస్ ఖండించింది. బీజేపీ నేతలను తమను సంప్రదిస్తూనే ఉన్నారంది. “అవును, బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరూ మమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నించారు. రెండు పార్టీలకు ఇప్పుడు మా అవసరం వచ్చింది. ఆ స్థితిలో ఇవాళ జేడీఎస్ ఉంది” అని తన్వీర్ అహ్మద్ అన్నారు. “రాష్ట్ర అభివృద్ధి కోసం మేము రెండు జాతీయ పార్టీలకు చెక్ పెట్టాలని కర్నాటక ప్రజలు కోరుకుంటున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ, కర్నాటక అభివృద్ధి కోసం జాతీయ పార్టీలతో కలిసి పనిచేస్తుంది” అని అన్నారు. కర్నాటక, కన్నడిగుల అభ్యున్నతికి పాటుపడే పార్టీతో వెళతామన్నారు.

పార్టీ గెలుపొందే సీట్ల సంఖ్యకు వచ్చిందా అని అడిగిన ప్రశ్నకు, “మేము లేకుండా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు, ఇది మంచి సంఖ్య, నేను అనుకుంటున్నాను, డబ్బు పరంగా జాతీయ పార్టీల వనరులతో మేము సరితూగలేం. అర్ధ బలం, అంగబలం విషయంలో జేడీఎస్ బలహీనం. కానీ మేము ప్రభుత్వంలో భాగం అయ్యేలా ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. పార్టీ అధినేత హెచ్‌డి దేవెగౌడ అనారోగ్య కారణాలతో పూర్తి బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామి ఆరోగ్య పరీక్షల కోసం సింగపూర్‌లో వెళ్లినట్టు ఆయన కార్యాలయం పేర్కొంది. కౌంటింగ్ రోజున ఉదయమే ఆయన తిరిగి వస్తారని సంబంధిత వర్గాలు ధృవీకరించాయి.