ప్రధాని పీఠం ఖాళీగా లేదు… కానీ కేసీఆర్ ప్రధాని కలలు కంటున్నారు!
దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్ విస్తరణ ప్రణాళికలను అపహాస్యం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాని పదవి ఖాళీగా లేదని, 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారని తేల్చి చెప్పారు. తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన ‘పార్లమెంటు ప్రభరి యోజన’లో భాగంగా జరిగిన భారీ విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, దేశమంతా తిరుగుతున్నారని, అయితే ప్రధాని పదవి ఖాళీగా లేదని అన్నారు. ముందు రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోండంటూ హితవు పలికారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో దయచేసి బీజేపీకి ఓటేయాలని కోరారు. గత ఎనిమిదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని, అవినీతి తీవ్రరూపం దాల్చిందని అన్నారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా సోమవారం మహారాష్ట్రలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారడంపై దుమ్మెత్తిపోసిన ఆయన.. ఇది కేవలం అవినీతిని మళ్లించే ఎత్తుగడ అంటూ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిపివేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు ఏం చేస్తోందో తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్నారు. పేదలకు ప్రధాని మోదీకి మధ్య ఉన్న దూరాన్ని బీఆర్ఎస్ పెంచలేదన్నారు.

