Home Page SliderNational

ప్రధానికి వెయ్యి కోట్లిచ్చానని చెబితే, అరెస్టు చేసేస్తారా?”: కేజ్రీవాల్

విచారణ సంస్థలు, కోర్టులకు అబద్ధాలు చెబుతున్నాయని, అరెస్టు చేసిన వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నాయని… ఎలాంటి తప్పు చేసినట్లు రుజువు కావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐకి సమన్లు ​​జారీ చేసిన మరుసటి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో దాడికి దిగిన కేజ్రీవాల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలు తమ తీవ్ర రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు అసాధారణ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.

14 ఫోన్‌లను ధ్వంసం చేశారని, అఫిడవిట్‌లలో కోర్టులకు అబద్ధాలు చెప్పారని, అనుమానితులను చిత్రహింసలకు గురిచేశారని, ‘మీ కూతురు రేపు కాలేజీకి ఎలా వెళ్తుందో చూస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాయని విచారణ సంస్థలపై ఆయన మండిపడ్డారు. మనీష్ సిసోడియాతో సహా అనేక మందిని నెలల తరబడి విచారణ జరుపుతున్నప్పటికీ… అనేక అరెస్టులు జరిగినప్పటికీ, మద్యం కుంభకోణంలో అక్రమ సంపద అంటూ చెబుతున్నదాంట్లో ఒక్క పైసా కూడా విచారణ సంస్థలు కనుగొనలేదన్నారు కేజ్రీవాల్. విచారణ సంస్థల దాడులలో ఏమీ దొరకనప్పుడు, గోవా ఎన్నికల ప్రచారానికి డబ్బు చేరిందని ఎలా చెప్తారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆప్ పార్టీ చెల్లింపులన్నీ చెక్కులతో జరిగాయన్న కేజ్రీవాల్… మాకు వచ్చిన ₹ 100 కోట్లలో ఒక్క రూపాయినైనా చూపించాలన్నారు.

“సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీకి ₹ 1,000 కోట్లు చెల్లించానని రుజువు లేకుండా చెబితే, మీరు అతన్ని అరెస్టు చేస్తారా?” అంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అసత్యాల ప్రచారం చేస్తున్న విచారణ సంస్థలపై దావా వేస్తానని ప్రకటించాడు. “అవినీతి అని వారు పిలిచే అదే విధానాన్ని పంజాబ్‌లో ప్రవేశపెట్టారు. దాని ఫలితంగా 50 శాతం ఆదాయం పెరిగింది. ఇది వ్యవస్థను మార్చే పారదర్శకమైన విధానం” అని కేజ్రీవాల్ చెప్పారు.

గత ఏడాది ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీ, రాజధానిలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వ నియంత్రణను రద్దు చేయడంతో ప్రైవేట్ రిటైలర్లకు అనుచిత ప్రయోజనాలు చేకూర్చారనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. మొత్తం కుట్రలో కేజ్రీవాల్ ప్రభుత్వం “అత్యున్నత స్థాయి” ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, ఈ విధానంలో ఫేవర్‌ల కోసం కోట్లాది కిక్‌బ్యాక్‌లు చెల్లించారని… గత ఏడాది గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఏజెన్సీ పేర్కొంది. ఫిబ్రవరిలో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడంతో సంచలనం రేగింది.