ప్రజలకు మేలు చేయవచ్చనే నమ్మకంతోనే బీజేపీలో చేరా
ఎలాంటి పదవులు ఆశించి భారతీయ జనతా పార్టీలో చేరలేదని మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. తన సేవలు భారతీయ జనతా పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ పనిచేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. విజయవాడలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్ఠానం అస్తవ్యస్థ నిర్ణయాలతో కాంగ్రెస్ బాగా దెబ్బతిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో బలహీనపడుతోందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామన్నా… వద్దని చెప్పానన్నారు. నీళ్ల సీసా కింద పడకముందే జాగ్రత్తపడాలని కింద పడి పగిలాక నీళ్లను సీసాలో పోయలేమని చెప్పానని కిరణ్ చెప్పారు. ప్రజలకు మేలు చేయవచ్చనే నమ్మకంతోనే భారతీయ జనతా పార్టీలు చేరానన్న ఆయన, తాను సీఎంగా ఉన్నప్పటి కంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంతో సాయం అందిస్తోందన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకొస్తామన్నారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు.

