“అబద్దాన్ని వందసార్లు చెప్పినంత మాత్రాన నిజం కాదు బాబూ”-జగన్
చంద్రబాబు పదే పదే అబద్దాలు చెప్పినంత మాత్రాన అది నిజం కాదని, నిజమేమిటో ప్రజలకు తెలుసన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. నేడు మార్కాపురంలో సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వ పథకాలను వివరిస్తూనే చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. 2014 నుండి 1019 మధ్య ఒక ముసలాయన ప్రభుత్వం ఉండేదని, అప్పట్లో దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మహిళలకు అమ్మఒడి పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రమూ చేపట్టలేదని, తమ ప్రభుత్వమే మొట్టమొదటిసారిగా అమలు చేసిందని తెలియజేశారు. అనేక పథకాల ద్వారా కోటిమంది మహిళలు లబ్ది పొందారన్నారు. రాజకీయంగా కూడా మహిళలకు సాధికారత కల్పించామన్నారు. ఇప్పటి వరకూ 1,42,000 కోట్లరూపాయలు మహిళల ఖాతాలలో వేశామన్నారు.

చంద్రబాబు మాటలన్నీ బూటకాలని, మోసాల బాబుని తెలుగు మహిళలు గట్టిగా నిలదీయాలన్నారు. తెలుగు మహిళలంతా తన అక్కచెల్లెళ్ల వంటి వారేనన్నారు. 46 నెలలుగా మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలుచేశామన్నారు. తాను చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నాని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ట్రాలు చూసి కాపీ కొడుతున్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. చంద్రబాబు తాము కట్టిన టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్లి ఫేక్ సెల్ఫీ ఫొటోలు తీసుకుని సెల్ఫీ చాలెంజ్ అని వేషాలు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ప్రతీ పేదవారి ఇళ్లకు వెళ్లి వారితో కలిసి తను చెేసిన మంచిని చిరునవ్వుతో చెప్పగలిగితే అప్పుడు తీసుకో సెల్ఫీ అని చాలెంజ్ చేశారు. అది నిజమైన సెల్ఫీ చాలెంజ్ అని పేర్కొన్నారు. ఈ నిజాలు ప్రతీ వ్యక్తికి తెలుసని, గత ప్రభుత్వపు అబద్దాలను మీడియా, పేపర్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారని, ఈ అబద్దాల బ్యాచ్ చెప్పే విషయాలను ప్రజలే వారి ఐదేళ్ల పాలనలో ఏం చేశారని అడగమన్నారు.