Home Page SliderNational

కర్నాటక బీజేపీలో ముసలం.. మాజీ సీఎం జగదీష్ షెట్టర్ తిరుగుబాటు

బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తానంటూ ప్రకటించిన జగదీశ్ షెట్టర్
హుబ్బళ్లి నుంచి మరొకరికి అవకాశం కల్పిస్తామంటూ పార్టీ ప్రతిపాదన
ఆరుసార్లు ఎన్నికైన నేతకు ఇలాంటి అవమానమా అంటూ మండిపాటు
ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపిస్తానంటున్న జగదీష్ షెట్టర్

మరో నెల రోజుల్లో ఎన్నికల నాగారా మోగనున్న తరుణంలో కర్నాటకలో బీజేపీ తిరుగుబాటును ఎదుర్కొంటోంది. పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గం నుంచి మరొకరికి అవకాశం కల్పించాలని పార్టీ నేతలు కోరడంపై ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. టికెట్ ఇవ్వనని చెప్పడంపై ఆయన కస్సుమంటున్నారు. హుబ్బళ్లి ఎమ్మెల్యే అయిన శెట్టర్ గతంలో ఆరు ఎన్నికల్లో విజయం సాధించారు. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి మహేష్ నల్వాడ్‌ను ఓడించి 21,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. గత ఆరు ఎన్నికల్లో 21,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఎన్నికల్లో గెలిచాను. నా మైనస్ పాయింట్లు ఏంటి? అంటూ ఆయన పార్టీ తీరును ప్రశ్నించారు.